ఏదైనా ఆటలో కొందరు గెలుస్తారు.. మరికొందరు ఓడతారు. కానీ గెలిచేవారిలో ఉండేదేంటి.. ఓడినవారిలో లేనిది ఏంటి.. చాలాసార్లు.. మహామహులు అనుకున్నవారు కూడా ఓటమి బాట పడుతుంటారు. చాలాసార్లు అసలు ఊహించని వారు కూడా విజేతలవుతుంటారు. ఇందుకు కారణం ఏంటి..?

 

 

ఈ విచిత్రాలన్నింటికీ కారణం ఆ ఒక్కటే. ఆ ఒక్కటే మనసు. మనసు ధృఢంగా ఉండి.. గెలుపుపై సంపూర్ణ విశ్వాసంతో బరిలో దిగితే మైనస్ పాయింట్లు కూడా ప్లస్ అవుతాయి. గుణాత్మకమైన ప్రకృతి ప్రభావంవల్ల వ్యక్తిత్వపు మానసిక స్థితిగతులు మార్పు చెందుతుంటాయి. వీరులు, ధీరులు, రుషులు, తాపసులు తప్పటడుగులు వేయడానికి ప్రకృతి ప్రలోభాలే కారణం.

 

 

మన మనస్సు ఆరుగురు అంతశ్శత్రువుల దాడికి ఆగలేక ఆగమాగమై మూగపోవచ్చు. చతికిలపడవచ్చు. ఎలాగంటే.. అర్జునుడి వంటి జగదేక ధనుర్ధరుడు కురుక్షేత్రంలో చతికిలపడ్డాడు. అలాగే.. విశ్వామిత్ర మహర్షికి మేనక కనిపించగానే మనసు మూగబోయి మనిషిని దాసుడిగా మార్చేసింది. బంధానికి, మోక్షానికి మనసే కారణమన్న ఉపనిషత్తు వాక్యం అక్షరసత్యం.

 

 

అందుకే మనస్సును కంట్రోల్‌లో ఉంచుకున్నవారికి విజయావకాశాలు మెండుగా ఉంటాయి. అంతే కాదు.. ప్రపంచాన్ని గెలుచుకున్నా, మనసును జయించకపోతే ఆ వీరుడు ధీరుడు కాలేడు. స్థితప్రజ్ఞుడే ఈ ప్రపంచంలో అసలైన ప్రాజ్ఞుడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: