“పుస్తకం వనిత విత్తం పరహస్తం గతం గతః

అథవా పునరాయేణ జీర్ణ  భ్రష్ఠ ఖండసః”


పై శ్లొకం వివరణ తో కూడిన భావం:

పుస్తకము, స్త్రీ, ధనం వీటిని పోగొట్టుకున్నా, ఇంకెవరి వద్దనైనా ఉంచినా అవి తిరిగిరావు. ఒకవేళ తిరిగి యజమాని చేతికి వస్తే  ‘పుస్తకం చినిగి, పేజీలు పోయి, నలిగి జీర్ణావస్థలో చేరుతుంది. స్త్రీ అవమానం పొంది, శీలం కోల్పోయి, యజమానిపై మనసు చచ్చి లేదా పిచ్చిదై రావచ్చు. ధనం వాయిదాల పద్దతిలో గాని, తక్కువ పరిమాణంలోగాని జగడాలతో, తొలి స్నెహాన్ని చెరచి అందుతుంది’. పై ప్రాణ సమాన విలువలున్న సంపదను 'ప్రాణం కన్నా మిన్నగా చూసుకోవాలని, కాపాడుకోవాలని'  శాస్త్రకారుని భావన.


 


కాలం మారింది, సాంప్రదాయాలు మారిపోయాయి, వ్యవస్థల్లో మార్పులొచ్చాయి, సాంకెతికాభివృద్ధి ఎంతగానో పెరిగినా మానవ నైజం మారలేదు. పై విలువైన ప్రాణప్రదమైన సంపద కు రక్షణ అనాదికాలములో ఎలాఉందో ఇప్పుడూ అలాగే ఉంది.

 

మనవద్ద ఎవరైనా పుస్తకం చదివి ఇస్తానని తీసుకుంటే 99% ఆ పుస్తకం మనం అడగందే తిరిగిరాదు. వచ్చినా నలిగిపోయి, పేజీలు చినిగి లేదా మాయమై, మనమిచ్చినప్పటి ఆకృతి కోల్పోయి రావటానికైతే తిరిగివస్తుంది. కాని మీకు ఆ రాకడలో సంతృప్తి ఉండదు.

 

ఇక వనిత గురించి చెప్పనవసరం లేదు. భారత రాజధానిలోనే నిర్భయ ఘఠన, కేరళ లోని జెస్సీ, తమిళనాడ్ లో స్వాతి, ఆంధ్రలో జ్యోతి.....ఇలా అతివలు ధన, మాన, ప్రాణాలను కోల్పోతున్నారు, ఇక్కడ అక్కడ అనే తేడాలేదు.



 

బాంకులనుండే విత్తం, అంటే డబ్బు అప్పుగా తీసుకొని దేశాల సరిహద్దులు దాటే విజయ మాల్యాలు, వైభవం, భయం లేకుండా అనుభవించే కావూరి లాంటి వాళ్ళ సంఖ్యకు అంతేలేదు. మనమెవరికైనా డబ్బు ఇస్తే చాలు కొత్త గా శతృవు దొరికినట్టే. "సొమ్మూ పాయే శనిబట్టే" అనే సామెతకు అర్ధం పక్కాగా తెలుస్తుంది.    



 

సుమారు 33000 యేళ్ళ క్రితం వ్రాయబడ్డ ఈ సంస్కృత శ్లొకం ఇప్పటికీ తాజా గానే ఉంది. ఇంత కాలం గతించినా  కాలచక్ర భ్రమణం ఈ  శ్లోకము లోని భావాన్ని ఇసుమంతైనా మార్చలేదు. అంతే భారతీయ సాహితీ విజ్ఞాన భాండా గార మంతా పరిశొధించి, పరిశీలించి, ప్రయోగాత్మకంగా చూసి రాయబడినవే. ప్రాచుర్యములోనికి వచ్చినవే. అందుకే భారతీయ సాహిత్యాన్ని సంపద తో పోల్చి సాహితీ సంపద అనే అంటారు.

 



ధనం, వజ్ర వైడూర్యాలే సంపదలుకాదు. ఒక ఉత్తమ పాఠకునికి పుస్తకాలు, ఉత్తమ మానవునికి తల్లి, చెల్లి, ఉపాధ్యాయిని, స్నేహితురాళ్ళు విలువైన సంపద వారే వారే లేకపోతే జీవితమే ఉండదు. ఉత్తమ ప్రేమికునికి ప్రేయసే ప్రాణం, జీవితం, సర్వం. అందుకే వనితలూ విలువైన సంపదలే. ఇక ధనం జలం లాంటి జీవనాధారమే. 'ధనం ఇదం మూలం జగత్’  అంటారు. ఈ జీవన రధానికి  ధనమే ఇందనం. అదీ విలువైన సంపదే.   

 


ఇక్కడ విమర్శకు అవకాశం ఉన్నది వనిత విషయమే. ఎంతో అభివృద్ధి చెందిన మహిళలు దేశాన్ని ఎలే ఈ కాలములో పుస్తకం, విత్తం తో వనితలని పోల్చటం తప్పు అని స్త్రీవాదులు అనవచ్చు. కాని మన పూర్వీకులు అమ్మాయిలకు పసితనంలో తల్లిదండ్రులు, కౌమారం లో సోదరులు, వివాహానంతరం యవ్వనం లో ఆ తరవాత జీవితాంతం భర్త. భర్త మరణిస్తే పుత్ర సంతానం తోడునీడలో ఉండే సంస్కృతిని మనకి ఏర్పరచారు. చూడండి వీరెవరూ తోడులేని స్త్రీ జీవితమెలా ఉంటుందో?

 


ఈ దుర్మార్గపు కాలములో కొన్ని సందర్భాల్లో వీరూ వనితల పాలిటి యమభటులే అవుతున్నారు. లైంగిక హింసలకు బలయ్యే యువతుల్లో, ఆధునిక మహిళలు, పసివాళ్ళు, పనివాళ్ళు, విద్యావంతులు, ఉద్యోగినులు, ఇల్లాళ్ళు - వీరూ వారు అని కాదు, అందరూ ఉన్నారు. మన సంస్కృతి ఏర్పరచిన పరిధిని అనుసరిస్తే విలువైన, మనం మనసారా ప్రెమించే, ఆరాధించే, అభిమానించే, వనితలను విలువైన సంపదలా కాపాడుకోవచ్చు. స్త్రీ పురుషులకు ప్రకృతే భిన్న భాధ్యతలను జన్మతః అప్పగించింది. పురుషులకు దేహధారుఢ్యం స్త్రీలకు సంతానం పొందే నిర్మాణం. వీటిని కాదనలేము కదా! స్త్రీ లేక పోతే ఈ విశ్వం ఉనికి కే ప్రమాదం. అందుకే వనితలను కూడా విలువైన సంపదలాగా కనుపాపలా (ఆస్తిలా కాదు) కాపాడుకోవాలేనేది ఈ శ్లోక రచయిత భావన.

   

 

మరింత సమాచారం తెలుసుకోండి: