ఒక ధనికుడు  చాటింపు వేయించాడు. బంగారు నాణాలు పంచుతానని, అవసరమైన వారంతా వచ్చి తీసికొనండొహో!! అని. ఇంకేం? బోలెడంతమంది వచ్చి లైను కట్టారు. ధనికుడు గుమ్మం వద్ద తన గుమాస్తానొకడిని కూర్చోబెట్టాడు. నాణాలు పట్టికెళ్లినవారు ఏమంటున్నారో వ్రాయి అని అతడికి చెప్పాడు. ఆరోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ధనికుడు వచ్చిన వారందరికీ ఇరవయ్యేసి బంగారు నాణాలు పంచాడు. సాయంకాలం పిలిచి ప్రజల అభిప్రాయాలు ఏమని వ్రాసావో చదవమన్నాడు.
గుమాస్తా చదవడం ప్రారంభించాడు. 


1వ వాడు: ఇంకో 20 నాణాలిస్తే వీడిసొమ్మేం పోయింది? పిసినారి పీనుగ!
2వ వాడు: ఇంకో పదినాణాలు వేస్తే గానీ ఈ పూటకి తాగడానికి సరిపడా మద్యంరాదు. ఆ పదీ కూడా ఇవ్వచ్చు కదా. 
3వవాడు: అయ్యో! దీనికి మరో ఎనభై నాణాలు కలిపి ఇవ్వకూడదూ? నా కూతురికి ఓ నగ కొందును కదా?

అంతట ధనికుడు చెవులు మూసుకున్నాడు. చాలు చాలు చదవకు.. అని సాధు పుంగవుని వద్దకు పరుగెత్తాడు. స్వామీ, నేను ఈవిధంగా దానమిస్తే అందరూ ఏదో ఒక రకంగా అసంతృప్తే వ్యక్తపరచారు. ఎవరైనా సంతృప్తి పడితే నాకు పుణ్యం వస్తుంది కానీ అసంతృప్తి చెందితే నాకు పుణ్యం ఎలా వస్తుంది.. అంటూ వాపోయారు.
సాధువతనిని ఓదార్చి 'బాధపడకు నాయనా! ఈసారి షడ్రసోపేతంగా వండించి అందరికీ మంచి భోజనాలు పెట్టించు' అని బోధించాడు.
Image result for bhojanam
ధనికుడు తన ఇంట్లో భోజనానికి రమ్మని మళ్లీ ఊరంతా చాటింపు వేయించాడు. మళ్లీ తన గుమాస్తా ప్రజల అభిప్రాయాలను వ్రాయమన్నాడు. మరునాడు రకరకాల పిండివంటలతో ఊరందరికీ కమ్మని భోజనం పెట్టాడు. ఆ సాయంత్రం తిరిగి గుమాస్తాను పిల్చి ప్రజాభిప్రాయాలు చదవమన్నాడు. 

1వ వాడు: అన్నదాతా సుఖీభవ!
2వ వాడు: ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నాళ్లయింది? బాబుగారు చల్లగా ఉండాలి. 
3వ వాడు: అమ్మయ్య ! ఆకలి చల్లారింది. అయ్యగారు ఆరి బిడ్డలు, అందర్నీ దేవుడు చల్లగా చూడాలి.

దాదాపు అందరూ ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తపరచారు. ధనికుడు వింటూ ఆనందంతో పొంగిపోయాడు. కోట్లు సంపాదించినపుడు అతడికి లభించని సంతృప్తి ఆనాడు లభించింది. అన్నదాన మహిమ ఎంతటిదో అతడు గుర్తించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: