హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ సృష్టిని ప్రారంభించిన చైత్ర శుద్ధ పాడ్యమిరోజును ‘ఉగాది’ గా భావిస్తారు. వసంతానికి స్వాగతం పలుకుతూ కొత్త కోరికలతో ఈ ‘ఉగాది’ ని ప్రారంభించడం అనాది కాలం నుండి వస్తున్న సాంప్రదాయం. జీవితంలోని కష్టలను సుఖాలను గుర్తుకు చేస్తూ ఈరోజు అందరూ తీసుకునే ఉగాది పచ్చడిలోని షడ్రుచులలో ఎంతో వేదాంత పరమార్ధం ఉంది. 

‘ఉగాది’ అంటే కాలాన్ని దేవుడుగా పరిగణిస్తూ క్షణం ఒక యుగంగా భావించే వారికి కాలంలోని నిఘూడమైన శక్తి అర్ధం అవుతుంది. అందుకే ప్రకృతికి మనిషికి కాల విభజనకు గల సంబంధాన్ని ఈ ‘ఉగాది’ తెలియ చేస్తుంది. ‘ఉగాది’ వికాసానికి గుర్తు. భూమి పై వసంతం వికసించిన తొలిరోజును ఉగాదిగా పరిగణించడం వేద కాలం నుండి కొనసాగుతోంది. మిగతా పండుగలకు ఉగాదికి మధ్య ఎంతో వైవిధ్యం ఉంది. 

ఈ పండుగ రోజున ఏ దేవుడు పేరుకు ప్రాముఖ్యత ఉండదు. కాలానికి సంకేతంగా మానవ జీవితానికి కాలానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేస్తూ ఉగాది పండుగను జరుపుకుంటాం. మనిషి ఎప్పుడు మంగళ ధ్వనులు వినాలనే కోరికకు ప్రతి రూపమే కోకిల కూత. ‘ఉగాది’ రాకతో చెట్లు అన్నీ పువ్వులు కాయలతో కళకళ లాడినట్లు మనిషి జీవితం ఎప్పుడు ఆనందంగా ఆశలతో ముందుకు సాగాలి అన్న సంకేతం ‘ఉగాది’ పండుగలో కనిపిస్తుంది. ప్రస్తుతం వాడుకలో ఉన్న కాల విభజన సూర్య సిద్దాంతం ప్రామాణికంగా జరిగిన నేపధ్యంలో ప్రతి కొత్త సంవత్సరానికి ఒక పేరుతో పాటు సూర్య సిద్దాంతానికి అనుగుణంగా రచించిన పంచాంగాలు ఈకొత్త సంవత్సరంలో వివిధ గ్రహ రాశులకు సంబంధించిన మానవ జీవితాలు ఈ సంవత్సరంలో ఎలా ఉండబోతాయో ముందుగానే చెపుతారు.  

కొత్త సంవత్సరానికి గుర్తుగా ఉగాది పచ్చడి తయారు చేస్తారు. కొత్త బెల్లం కొత్త చింతపండు మామిడికాయలు వేప పూత మిరియాలు  ఉప్పు కలిపి ‘ఉగాది’ పచ్చడి తయారు చేయడం ఈ పండుగ ప్రాముఖ్యత. ఈ ఉగాది పచ్చడిలో ఉన్న ప్రతి పదార్థానికి ఒక విశిష్ఠత ఉంది. బెల్లం సంతోషానికీ - వేప దు:ఖానికి ప్రతీకలు. అయితే ప్రతి ఏటా వచ్చే  ఒక్కో సంవత్సరం ఒక్కో పేరుతో ‘ఉగాది’ అని పిలుస్తారు. పురాణాల ప్రకారం విష్ణుమాయ కారణంగా నారదుడికి జన్మించిన 60 మంది సంతానమే ఈ తెలుగు సంవత్సరాలని అంటారు. ఈ పేర్లు శాశ్వతంగా నిలిచిపోతాయని విష్ణుమూర్తి వరం ఇవ్వడంతో ప్రతి ఉగాదికి అవే పేర్లుగా మారిపోయాయి. ఈ ఏడాది వస్తున్న ఉగాది పేరు ‘వికారినామ సంవత్సరం’. 

అయితే ప్రతి సంవత్సరం వచ్చే ‘ఉగాది’ కి ఈ సంవత్సరం వచ్చిన ‘ఉగాది’ కి చాల వ్యత్యాసం ఉంది. తెలుగు రాష్ట్రాల నాయకుల తలరాతలను మార్చడమే కాకుండా తెలుగు ప్రజల భవిష్యత్తును ప్రభావితం చేసే ఎన్నికలు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలు ఎన్నికల హోరుతో హోరెత్తి పోతున్నాయి. ఒక వైపు మండుతున్న సూర్యుడు మరొక వైపు ఎన్నికల వేడి మధ్య వస్తున్న ‘వికారినామ సంవత్సరం’ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాలు కలగాలని ఇండియన్ హెరాల్డ్ అందరికీ ‘ఉగాది’ శుభాకాంక్షలు..


మరింత సమాచారం తెలుసుకోండి: