ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది. అదే సమయంలో చాలా మంది చాలా రకాల సలహాలు ఇవ్వడంతో కన్‌ఫ్యూజన్ కూడా పెరిగింది. సర్వరోగ నివారిని పేరుతో ఎప్పుడో 25 ఏళ్ళ క్రితం ఆయిల్ పుల్లింగ్ అని వచ్చింది. పొద్దున్న ఎవరికి ఫోన్ చేసిన మా ఆయన ఆయిల్ పుల్లింగ్ చేస్తున్నాడనే వాళ్ళు. అదీ ఆగిపోయింది. తరువాత నీళ్ళ రాజు వచ్చాడు. కుండలు కుండలు నీళ్ళు తాగితే రోగాలు మాయం అన్నాడు. అదీ పోయింది.


ఈ మధ్య ఒక ఆయన చికెన్ తింటె కొవ్వు తగ్గుద్దని ప్రచారం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇంకొకాయన వచ్చి రాగులు, సజ్జలు, జొన్నలు, కూరగాయలు అన్నీ కలిపి రసం చేసుకొని తాగండీ అంటున్నాడు. కేంద్ర ప్రభుత్వము వారేమో యోగా చెయ్యండి రొగాలు మటు మాయమంటుంది. అసలింతకీ ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి? ఇలాంటి వారిని అదుపు చెయ్యాల్సివ అవసరం ఎంతైనా వుంది. ప్రభుత్వ పోషకాహార సంస్థలు నిద్ర పోతున్నాయా? ప్రజలు వత్తిడి తేవాలి, మార్పు రావాలి.


ఆ మధ్య, అంటే చాన్నాళ్ళ క్రిందట గోదావరి జిల్లాల నుంచి ఒక రాజు గారు వచ్చి, ‘ఉప్పా..! మీరు ఉప్పు తింటున్నారా? అడవిలో జంతువులూ ఉప్పు తినట్లేదు, ఆకాశంలో పక్షులూ ఉప్పు తినట్లేదు. మరి మనుషులెందుకు ఉప్పు తింటున్నారు? ఛీ ఛీ’ అన్నాడు. జనమంతా ఉప్పుని విసిరికొట్టారు. ‘నూనా, నెయ్యా - మీరంతా నూనె తాగుతున్నారా? నెయ్యి తింటున్నారా?’ మళ్ళీ సేమ్ డైలాగ్ ‘అడవిలో జంతువులకి నూనె మిల్లులున్నాయా?, అవి డబ్బాలు డబ్బాలు నూనె తాగుతున్నాయా?’ అన్నాడు. నూనె చుక్క లేకుండా బజ్జీలూ, గారెలూ, పకోడీలు అనబడే పిండి వంటల్ని ఎలా వండుకోవాలో జనాలందరికీ వొలిచి చేతిలో పెట్టి చెప్పాడు కూడా.


విచిత్రం ఏంటంటే, వీళ్ళెవరూ డాక్టర్లు కాదు. చెయ్యాల్సింది చేయకుండా ఎంతకాలమని వాళ్ళు చెప్పారనీ, వీళ్ళు చెప్పారనీ ఆరోగ్యం కోసం చెంబులేసుకుని, సంచులేసుకుని పరుగెడతారు?ఇకనయినా పరుగులాపి ప్రశాంతంగా జీవించండి. మన పూర్వీకులు అన్నీ తిని చక్కగా పని చేసుకున్నారు. మనం పని మాని ఇలాంటి వాటి వెనుక గంతులేస్తున్నాము!


మరింత సమాచారం తెలుసుకోండి: