కడప జిల్లా జమ్మలమడుగు అనగానే గుర్తొచ్చే పేరు ఆదినారాయణ రెడ్డిదే. టీడీపీకి కంచుకోటగా ఉన్న జమ్మలమడుగుని తన కంచుకోటగా మార్చేసుకున్నారు. అసలు టీడీపీ ఆవిర్భావం దగ్గర నుంచి జరిగిన ఎన్నికల్లో అంటే 1983, 1985, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా టీడీపీ అభ్యర్ధులు గెలిచారు. రెండుసార్లు పొన్నపురెడ్డి శివారెడ్డి, రెండుసార్లు పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డిలు విజయం సాధించారు.

 

అయితే 2004 ఎన్నికలోచ్చేసరికి పరిస్థితి మొత్తం మారిపోయింది. వైఎస్ హవాలో ఆదినారాయణ రెడ్డి అప్పటి టీడీపీ అభ్యర్ధి రామసుబ్బారెడ్డిపై గెలిచారు. ఇక 2009లో కూడా అదిరిపోయే విజయం అందుకున్న ఆదినారాయణ, 2014లో వైఎస్సార్‌సీపీలోకి వచ్చేసి, ఆ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా ఆదినారాయణ టీడీపీలోకి వచ్చేశారు. అలాగే ఆయనకు మంత్రి పదవి కూడా దక్కింది.

 

ఇక మంత్రి పదవి దక్కాక ఆదినారాయణ, జగన్‌పై ఎలాంటి విమర్శలు చేశారో కూడా తెలుసు. ఆ విమర్శల ఫలితమే 2019 ఎన్నికల్లో ఆదినారాయణకు కనిపించింది. ఎన్నికల్లో చంద్రబాబు ఆదినారాయణని కడప ఎంపీగా బరిలోకి దింపితే, జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డిని పోటీకి దించారు. అటు ఆదినారాయణ ఘోరంగా ఓడిపోగా, ఇటు జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డిని వైఎస్సార్‌సీపీ నుంచి బరిలో దిగిన సుధీర్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడించారు.

 

దాదాపు 51 వేల ఓట్ల పైనే మెజారిటీతో గెలిచిన సుధీర్...జమ్మలమడుగులో దూకుడుగా పనిచేస్తున్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా...వాటిని పరిష్కరించడానికి చూస్తున్నారు. తన ఇంటి వద్దకే ప్రజలని పిలిపించుకుని , సమస్యలు తెలుసుకుని, వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపిస్తున్నారు. ఇంకా నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తున్నారు. అలాగే నియోజకవర్గంలో తాగునీరు సమస్యలు లేకుండా చూసుకుంటున్నారు.

 

పాఠశాలల అభివృద్ధి కోసం చేపట్టిన నాడు-నేడు కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఇటు పార్టీ పరంగా కూడా చూసుకుంటే, జమ్మలమడుగులో వైఎస్సార్‌సీపీకి తిరుగులేదు. అసలు ఇక్కడ టీడీపీ అడ్రెస్ ఎప్పుడో గల్లంతైపోయింది. ఎన్నికలైపోయాక ఆదినారాయణ బీజేపీలోకి వెళ్లిపోతే, రామసుబ్బారెడ్డి వైఎస్సార్‌సీపీలోకి వెళ్లారు. దీంతో టీడీపీకి దిక్కు లేకుండా పోయింది. భవిష్యత్‌లో వేరే నాయకుడుని పెట్టిన కూడా...ఇక్కడ వైఎస్సార్‌సీపీని ఓడించడం కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి: