ఈమధ్య హైదరాబాద్ లో ఈ కరోనా సమయంలో నిర్వహించిన ఒక లేటెస్ట్ సర్వేలో కేవలం 22 ఫ్లాట్స్ కలిగిన ఒక అపార్ట్ మెంట్ కు వారంలో తక్కువలో తక్కువగా 400 పార్సిల్స్ వస్తున్నాయని అలా ప్రస్తుతం హైదరాబాదు లోని అపార్ట్ మెంట్స్ లో ఉండే వాళ్ళు ఎక్కువగా ఈ కరోనా భయాలతో ఆన్ లైన్ కొనుగోళ్ళ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఈ సర్వే తెలియచేసింది. చాలామంది దుస్తులు గాడ్జెట్లు ఇంకా రకరాకాల వస్తువులు బయటకు వెళ్ళకుండా ఆన్ లైన్ లోనే బుక్ చేసుకుంటున్నారని ఇది కేవలం ఒక భాగ్యనగరంలోనే కాకుండా అన్ని ప్రముఖ నగరాలు పట్టణాలు ప్రస్తుతం ఆన్ లైన్ అమ్మకాల జోరు పెరిగింది అన్నమాటలు వినిపిస్తున్నాయి.


దీనితో ప్రస్తుతం అన్ని వ్యాపారాలు తిరోగమన దశలో ఉన్నా ఈ కామర్స్ కంపెనీలు ముఖ్యంగా విదేశీ ఈ కామర్స్ కంపెనీలు ఈ లాక్ డౌన్ సమయంలో వేల కోట్లల్లో బిజినెస్ చేసాయి అన్న అంచనాలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం దేశంలో పెరిగిపోతున్న ఈవిదేశీ ఈకామర్స్ కంపెనీలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం త్వరలో సరికొత్త ఈ కామర్స్ విధానాన్ని ప్రవేశ పెట్టబోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.


దీనివల్ల ప్రస్తుతం దేశంలోని ఈకామర్స్ మార్కెట్ ను శాసిస్తున్న అమెజాన్ కంపెనీకి ప్రభుత్వ కొత్త నిబంధనలు చెక్ పెడతాయి అని అంటున్నారు. ప్రస్తుతం ఈకామర్స్ రంగానికి సంబంధించి కంపెనీల మధ్య నడుస్తున్న పోటీని నియంత్రించడానికి ఒక రెగ్యులేటర్ ను ఏర్పాటు చేస్తారని ఈ రెగ్యులేటర్ చెప్పే విధివిధానాలకు అనుగుణంగా విదేశీ ఈకామర్స్ కంపెనీలు ఉండే విధంగా కొత్త నిబంధనలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.


ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం మన దేశంలో దాదాపు 30 కోట్లమంది ఈ కామర్స్ కంపెనీల ద్వారా వస్తువులు తెప్పించుకుంటున్నారని ఇలాంటి పరిస్థితులలో ఈ కామర్స్ రంగంలో స్థానిక స్టార్టప్ లకు ప్రోత్సహించే విధంగా ఈ కొత్త ఈ కామర్స్ విధానం ఉంటుంది అని అంటున్నారు. ఇప్పుడు ఈ విధానం అమలులోకి వస్తే దేశంలో స్వదేశీ ఈ కామర్స్ కంపెనీలు చాల ఏర్పడి వాటి ద్వారా ఉద్యోగ అవకాశాలు ఏర్పడి ఈకరోనా వల్ల ఏర్పడ్డ నిరుద్యోగ సమస్యను కొంతవరకు తీరవచ్చు అన్న విశ్లేషణలు వినపడుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: