జూన్ లో చిన్న సినిమాలు బాక్స్ అఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. గత నెలలో  మహర్షి వంటి భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ అయిన విషయం తెల్సిందే. అయితే ఆ రేంజ్ సినిమాలేవీ ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు లేవు. ఇక ఈ నెల తొలివారం ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ నటించిన హిప్పీ సినిమా తొలుత ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏడవ తేదీన విజయ అంథోని, యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్ర లో నటించిన కిల్లర్ ద్విభాషా చిత్రం ప్రేక్షకులను పలకరించనుంది. హిప్పీ చిత్రం దర్శక, నిర్మాతలు యూత్ ఆడియన్స్ ను టార్గెట్ చేసినట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది.

వైవిద్య భరితమైన కథల తో ప్రేక్షకుల ముందుకు వచ్చే విజయ్ ఆంథోనీ, అర్జున్ తో కలిసి నటించిన కిల్లర్ చిత్రం ఎలా ఉండబోతుందోనన్న కుతూహలం సగటు ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే బిచ్చగాడు తరువాత సరైన హిట్ లేని విజయ్ ఆంథోనీ ని ఈ సినిమా ఎంతవరకు గట్టెక్కిస్తుందన్నది హాట్ టాఫిక్ గా మారింది. ఈ నెల 14  వ తేదీన విశ్వా మిత్ర అనే సినిమా రిలీజ్ కానుంది. ఇదే తేదీ మరికొన్ని సినిమాలు రిలీజ్ అయినా ఆశర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికైతే ఏ సినిమా కూడా రిలీజ్ షెడ్యూల్ ఖరారు కా లేదు కానీ ఒకటి, రెండు చిన్న చిత్రాలు రేసు లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 21  వతేదీన తెలంగాణ చేనేత కార్మికుడు మల్లేశం జీవిత కథ ఆధారంగా రూపొందించిన మల్లేశం చిత్రం  రిలీజ్ కానుంది. ఈ సినిమా యూనిట్  ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్స్ చక్కటి ఆదరణ కు నోచుకున్నాయి. ఇక సినిమా ఎంత వరకు ప్రేక్షకుల మనస్సును దోచుకుంటుందన్నది వేచిచూడాల్సిందే. అదే రోజు ఏజెంట్ సాయి శ్రీనివాస్ అనే కామెడీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుమంత్ హీరో గా మళ్ళీ రావే సినిమా ను నిర్మించిన నిర్మాణ సంస్థ ఈ సినిమాను తెర కు ఎక్కించడం తో , ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. జూన్ లో మొత్తంగా చిన్న చిత్రాలే బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. మరి ప్రేక్షకులు ఏ చిత్రాన్ని ఆదరిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: