హీరో అంటే ఫైట్లు చేయాలి, ఫీట్లు చేయాలి.... కానీ ఆ ఫీట్లలో గాయాలు కావొచ్చు, ఒక్కోసారి ప్రాణాలే పోవచ్చు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న అప్పుడప్పుడు గాయాలు తప్పవు.అప్పుడు అభిమానుల కోసం, ఇప్పుడు జనం కోసం కష్టపడుతున్న పవన్ కి పాత గాయాల నొప్పులు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పవన్ అంటేనే ప్రాణం ఇస్తారు జన సైనికులు. పవన్ ఒంటికి చిన్న గాయం ఐన తల్లడిల్లిపోతారు. ఇప్పుడు పవనే స్వయంగా నా ఆరోగ్యం బాలేదు అని చెప్పేసరికి అభిమానుల్లో ఆందోళన నెలకొంది. 

విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావాల్సి ఉంది. కానీ వెన్నునొప్పి కారణంగా  రాలేకపోతున్నట్టు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. గత కొంత కాలంగా పవన్ ఆరోగ్యం గురించి వార్తలొస్తున్నప్పటికీ సమస్య ఏంటో స్పష్టత లేకపోయింది. కానీ  వెన్నునొప్పి కారణంగా తాను ఎంత బాధ పడుతున్నదీ చెప్పడంతో అసలు విషయం బయటకి వచ్చినట్టయింది.    

2012 లో గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో తన వెన్నుపూసకు తీవ్రమైన గాయాలైనట్టు పవన్ వెల్లడించారు. గాయాన్ని కూడా లెక్క చేయకుండా గత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. డాక్టర్లు సర్జరీకి చేయుంచుకోమని సలహా ఇచ్చినప్పటికీ  సంప్రదాయ వైద్యంపై నమ్మకంతో ముందుకు వెళ్తున్నట్టు ఈ ప్రకటనలో వివరణ ఇచ్చారు. ఐతే ఈ మధ్య కాలంలో  వెన్ను నొప్పి మరీ బాధించడంతో మూడు రోజులుగా ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నానని తెలిపారు. ప్రస్తుతం వెన్ను నొప్పికి చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. 

తన ఆరోగ్యం కారణంగానే మీడియా ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరుకాలేక పోతున్నానని పవన్ భాధ పడ్డారు.ఈ సమావేశానికి  జనసేన ప్రతినిధులు పాల్గొంటారని అందుకు మీడియా ప్రతినిధులు సహకరించాలని కోరారు. ఈ సమావేశం విజయవంతం కావాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు తెలియజేసారు. ఆమధ్య కన్ను వాపు, ఎన్నికల సమయంలో డీహైడ్రేషన్, ఇప్పుడు వెన్ను నొప్పి ఇలా ఒక్కొక్కటి   పవన్ అభిమానులను కలవరపరుస్తున్నాయి. ఆరోగ్యం ఇంత ఇబ్బంది పెడుతున్నా జనం కోసం పవన్ శ్రమిస్తూనే ఉన్నారు. మొన్న ఈ మధ్యనే పవన్ అభిమానులు 'అన్నయ్యా నీ ఆరోగ్యం జాగ్రత్త..' అని చెప్పడం ఇంటర్ నెట్ లో వైరల్ అయ్యుంది.



    మరింత సమాచారం తెలుసుకోండి: