‘పవన్ కల్యాణ్..’ ఈ పేరు వింటేనే వైబ్రేషన్స్ వచ్చేస్తాయి.. అని ఓ సినిమాలో డైలాగ్ ఉంది. రీల్ లైఫ్ లో అయినా, రియల్ లైఫ్ లో అయినా అభిమానులకు వైబ్రేషన్స్ తెప్పించగల హీరో ఆయన. ఆయన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటివి. ‘ఒక యావరేజ్ సినిమా ఇప్పించండి చాలు.. బ్లాక్ బస్టర్’ చేసుకుంటాం అని జల్సా ఆడియో ఫంక్షన్లో సాక్షాత్తూ చిరంజీవినే అడిగేశారు అభిమానులు. అలాంటి అభిమానాన్నే ‘అత్తారింటికి దారేది’ సినిమాకు చేసి చూపించారు మెగా ఫ్యాన్స్.

 



2013లో సమైక్యాంధ్ర ఉద్యమ హోరులో సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలీని పరిస్థితులు అవి. అనూహ్యంగా సెప్టెంబర్ 23న ఈ సినిమా ఇంటర్వెల్ వరకూ లీక్ అయిపోయింది. క్షణాలు, గంటల వ్యవధిలో అందరి సెల్ ఫోన్లలోకి చేరిపోయింది. ల్యాబ్ నుంచే ఒరిజినల్ ప్రింట్ బయటకొచ్చేయడంతో కుదేలయిపోయారు నిర్మాత భోగవల్లి ప్రసాద్. పవన్, త్రివిక్రమ్ కలిసి ఆయనకు ధైర్యం చెప్పి ఏమాత్రం ఆలస్యం చేయకుండా సినిమా రిలీజ్ కు అప్పటికప్పుడు ఏర్పాట్లు చేసేశారు. నాలుగు రోజుల్లో రిలీజ్ అని ప్రకటించి సెప్టెంబర్ 27న సినిమాను విడుదల చేశారు. అంతే.. ప్రభంజనం మొదలైంది. ఓపెనింగ్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. కలెక్షన్లకు ఆకాశమే హద్దు అయింది. ఓ ప్రభంజనంలా ఆ సినిమాను ఆదరించారు అభిమానులు, ప్రేక్షకులు.

 

 


అన్ని ఏరియాల్లో కలెక్షన్ల సునామీతో అప్పటివరకూ ఉన్న ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి ఓ కొత్త చరిత్ర సృష్టించింది ఈ సినిమా. సగం సినిమా ఒరిజినల్ ప్రింట్ లీకైనా ఇండస్ట్రీ హిట్ కొట్టిన సినిమాగా చరిత్ర సృష్టించింది. 100కోట్లకు పైగా వసూళ్లు సాధించి అప్పటికి నెంబర్ వన్ సినిమాగా నిలిచింది. నేటికి ఆ సినిమా విడుదలై 6 ఏళ్లు. కథ, కథనం, పాటలు, పవన్ స్టైల్.. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: