యాక్షన్ హీరో గోపీచంద్ కు గత కొంతకాలంగా సరైన విజయాలు రావట్లేదు. లౌక్యం సినిమా తరువాత సరైన సక్సెస్ లేని గోపీచంద్ నటించిన చాణక్య సినిమా ఈరోజు విడుదలైంది. గోపీచంద్ కు జోడీగా మెహ్రీన్ నటించగా తిరు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. స్పై చిత్రంగా విడుదలైన ఈ చిత్రంపై టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచాయి. ఈ సినిమాలో దేశం కోసం పనిచేసే అండర్ కవర్ ఏజెంట్ గా అర్జున్ పాత్రలో గోపీచంద్ నటించాడు. 
 
ఒక మిషన్ కోసం బ్యాంకు ఉద్యోగిగా మారిన అర్జున్ పాక్ దేశానికి చెందిన టెర్రరిస్ట్ ఖురేషికి సంబంధించిన కొంతమంది స్లీపర్ సెల్స్ ను చంపుతాడు. ఆ తరువాత అర్జున్ ఖురేషిని టార్గెట్ చేస్తాడు. అర్జున్ యొక్క మిషన్ ఏమిటి? అర్జున్ మిషన్ ను ఎలా పూర్తి చేశాడు? అనే ప్రశ్నలకు సమధానాలు దొరకాలంటే సినిమా చూడాల్సిందే. గోపీచంద్ ఈ సినిమాలోని అర్జున్ పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. 
 
సినిమాలో కామెడీ ఉన్నప్పటికీ కామెడీ పెద్దగా ఆకట్టుకోదు. కథ, కథనం కూడా రొటీన్ గానే ఉన్నాయి. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ బాగుంది. సెకండాఫ్ లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల్ని అలరిస్తాయి. ఫస్టాఫ్ లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. సినిమాలోని పాటలు పరవాలేదనిపించేలా ఉన్నాయి. నేపథ్య సంగీతం మాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఉంది. 
 
సినిమాను చాలా రిచ్ గా తెరకెక్కించారు. దర్శకుడు కథ, కథనంలో చేసిన పొరపాట్ల వలన ఈ సినిమా యావరేజ్ గా మిగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాణక్య సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు అన్ని భాషల్లో 15 కోట్ల రూపాయలకు అమ్ముడవటంతో నిర్మాతకు రిలీజ్ కు ముందే భారీగా లాభాలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చాణక్య సినిమా 13 కోట్ల రూపాయల షేర్ వసూలు చేస్తే మాత్రమే సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అయ్యే అవకాశం ఉంది. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: