తెలుగులో ఇప్పటి వరకు కబడ్డి ఆట నేపథ్యంలో సినిమాలొచ్చాయి. అలానే కిక్ బాక్సింగ్ బ్యాగ్డ్రాప్, రగ్బీ..మిగతా జాతీయ క్రీడల నేపథ్యంలో సినిమాలు వచ్చి సూపర్ హిట్స్ ని అందుకున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు గుణశేఖర్ కాంబినేషన్ లో వచ్చిన ఒక్కడు బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాని కబడ్డి బ్యాగ్డ్రాప్ లోనే రూపొందించారు. రవితేజ నటించిన అమ్మా నాన్నా ఒక తమిళమ్మాయి కిక్ బాక్సింగ్ నేపథ్యం తో వచ్చింది. ఇక దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి యంగ్ హీరో నితిన్ కాంబినేషన్ లో వచ్చిన సై సినిమాకి రగ్బీ ఆట నేపథ్యం. ఇక ఈ మధ్య అక్కినేని నాగ చైతన్య మజిలీ సినిమా, నేచురల్ స్టార్ నాని జెర్సీ క్రికెట్ బ్యాగ్డ్రాప్ లో వచ్చి మంచి కమర్షియల్ హిట్ ని అందుకున్నాయి. అయితే హాకీ క్రీడా నేపథ్యంలో మాత్రం ఏ హీరో ఇప్పటివరకు ట్రై చేయలేదు. ఇప్పుడు ఆ బ్యాగ్డ్రాప్ లోనే సందీప్ కిషన్ సినిమా రాబోతోంది. 

పదిహేను సార్లు ఓడిపోయి పదహారో సారి గెలిచాడు మహమ్మద్ గజినీ. ప్రస్తుతం యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రయత్నం కూడా అలానే ఉంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో హిట్ అందుకున్నప్పటికి మళ్ళీ ఇండస్ట్రీలో సొలో హీరోగా చెప్పుకోదగిన హిట్ మాత్రం రాలేదు. చేయడానికి మాత్రం 15 సినిమాలు చేశాడు. అయితే తమిళంలో మాత్రం కాస్త ఒకటి రెండు సినిమాలు హిట్ అందుకున్నాయి. ఇక ఇటీవలే నిను వీడని నీడను నేను రిలీజై ఫర్వాలేదనిపించే ఫలితం అందుకున్నాడు. ఈ ఉత్సాహంలోనే సందీప్ వరుసగా
సినిమాల్లో నటిస్తున్నాడు. తెనాలి రామ ఇప్పటికే సెట్స్ పై ఉంది. ఇది తెలుగు - తమిళంలో రిలీజవుతుంది.

తాజాగా ఏ1 ఎక్స్ ప్రెస్ అంటూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సినిమా క్రీడానేపథ్యంలో తెరకెక్కుతుంది. డెన్నిస్ జీవన్ కనుకలాను అనే నూతన దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. నవంబర్ లో షూటింగ్ ప్రారంభం కానుందని లేటెస్ట్ న్యూస్. హిప్ హాప్ తమిజ సంగీతం అందిస్తుండగా పీపుల్స్ మీడియా టీజీ విశ్వ ప్రసాద్- అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వివేక్ కూచిబోట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏ వన్ ప్లేయర్ గా సందీప్ ఎంతవరకు సక్సస్ అవుతాడన్నది సినిమా రిలీజైయ్యాక తెలుస్తుంది. ఇక ఈ సినిమా బయోపిక్ కేటగిరీనా కాదా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ లో ఉండగా క్రీడా బయోపిక్ ల ట్రెండ్ లో సందీప్ ఆశించిన హిట్టు దక్కుతుందా లేదా? అన్న టాక్ ఇప్పుడు మొదలైంది. ఇక ప్రస్తుతం సందీప్ చేస్తున్న మూడు సినిమాలు వేటికవే యూనిక్ కంటెంట్ తో తెరకెక్కుతున్నవే. మరి ఈ 3 సినిమాలలో ఏది సందీప్ కి స్టార్ ఇమేజ్ తెస్తుందో చూడాలి.   


మరింత సమాచారం తెలుసుకోండి: