జోకర్ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లన నమోదు చేసింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అందరి అంచనాలని దాటుతూ రికార్డులను తిరగరాస్తున్నది. జోక్విన్ ఫొనిక్స్ అద్భుతమైన నటన జోకర్‌ను విజయపథంలో నడిపించింది. ఈ సినిమాకు అన్నివర్గాల ప్రేక్షకులతోపాటు సినీ విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది.


ఫోర్బ్స్ తాజా రిపోర్టు ప్రకారం. జోకర్ చిత్రం భారత్‌లో కూడా భారీ వసూళ్లను సాధించింది. అక్టోబర్ 2వ తేదీన రిలీజైన ఈ చిత్రం బాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రాలకు ఎదురొడ్డి రికార్డు వసూళ్లను సాధించింది. అదే రోజున రిలీజైన వార్,స్కై ఈజ్ పింక్ అనే చిత్రాలకు మించి కలెక్షన్లను సాధించింది. మొత్తంగా భారతీయ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.50 కోట్లు కలెక్ట్ చేసింది.ఇప్పటి వరకు రిలీజైన ఈ నేపథ్యం ఉన్న చిత్రాల్లో జోకర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డును నమోదు చేసింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.6816.5 కోట్లు అంటే 953 మిలియన్ల డాలర్లు వసూలు చేసింది. కాగా ఈ చిత్రం రూ.446.1 కోట్ల బడ్జెట్‌తో అంటే 62.5 మిలియన్ డాలర్ల తెరకెక్కితే.. 15 రెట్లకుపైగా ఆదాయాన్ని తెచ్చిపెట్టింది.


తక్కువ బడ్జెట్‌తో రూపొంది ప్రపంచ బాక్సాఫీస్‌ను శాసించిన చిత్రాల్లో ది మాస్క్ టాప్‌గా నిలిచింది. 23 మిలియన్ డాలర్లతో ది మాస్క్ చిత్రం రూపొందింతే.. 351 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించింది. ఇక డెడ్ పూల్ అనే చిత్రం 58 మిలియన్ డాలర్లతో రూపొందితే ఏకంగా 783 మిలియన్ డాలర్లు వసూలు చేసింది అని ఫోర్బ్స్ ఓ ప్రకటనలో తెలిపింది.


జోకర్ చిత్రంలో జోక్విన్ ఫొనిక్స్ నటనతోపాటు రాబర్ట్ డీ నీరో, జాజీ బీట్జ్ లాంటి దిగ్గజ నటుల పాత్రలు ప్రేక్షకులను విశేషంగా ఆలరించాయి. ఈ చిత్రంలో నటించిన యాక్టర్ల ఫెర్ఫార్మెన్స్ ఆస్కార్ స్థాయిలో ఉన్నాయంటూ మీడియా ప్రశంసలతో ముంచెత్తింది. హాస్యం, భావోద్వేగం లాంటి అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో కాసుల పంట పడింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: