నాకు గిల్లడం ఇష్టం.. అందుకే `కమ్మ రాజ్యంలో కడప రెడ్లు` సినిమా తీశా అంటూ త‌న స‌హ‌జ‌శైలిని వ్య‌క్తం చేశాడు వివాదాస్ప‌ద  చిత్రాలను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌.  ఆయ‌న తాజా చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేప‌థ్యంలో బుధ‌వారం ఆ సినిమా విశేషాలు తెలియజేయాటనికి వర్మ మీడియా సమావేశం ఏర్పాటు  చేశారు. ఈసంద‌ర్భంగా మీడియా ప్ర‌తినిధుల‌తో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

 

ఈ సినిమాలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్‌, కేఏ పాల్‌, పవన్‌ కళ్యాణ్‌లను పోలిన పాత్రలు ఉన్నాయి. ఇప్పటికే టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌తో సినిమాకు కావాల్సినంత క్రేజ్‌ని తెచ్చి పెట్టాడు వర్మ. ఈ సినిమాపై వివాదాలు మొదల‌వ‌డం..విష‌యం కోర్టు దాకా వెళ్లడం లాంటి ప‌రిణామాల‌ను ఆయ‌న చిన్న విష‌యాలుగా కొట్టిపారేశారు. ఈ సినిమాలో నాకు న‌చ్చిన పాత్ర‌ల‌తో తెర‌కెక్కించాను. నా సినిమాలోని పాత్ర‌ల‌ను బ‌య‌ట వారితో ప్రేక్ష‌కులు పొల్చుకుని చూస్తే నాకు సంబంధం లేదంటూ అంతే విచిత్రంగా స‌మాధానం చెప్పేశారు.  

 

తాను కొద్దిరోజుల క్రిత‌మే ఈ క‌థ‌కు ప్లాన్ చేసి వెంట‌నే చిత్ర నిర్మాణానికి పూనుకున్న‌ట్లు తెలిపారు. ప్ర‌స్తుత రాజకీయ పరిస్థితులపై కొన్ని  సెటైర్లు వేస్తూ తీసిన చిత్ర‌మ‌ని స్ప‌ష్టం చేశారు.  ఏడు కొండ‌ల వాడి మీద‌..మీ మీద ఓట్టేసి చెబుతున్నా ఈ సినిమాకు జ‌న‌సేన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ఎలాంటి సంబంధం లేద‌ని...న‌వ్వుతూ చెప్ప‌డం విశేషం. మీడియా ప్ర‌తినిధులు అడిగిన అనేక విష‌యాల‌కు అంతే సూటిగా సెటైరిక‌ల్‌గా..హాస్యాన్ని పంచుతూ వ‌ర్మ స‌మాధానాలు చెప్పారు.

 

రెండు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు ఓ మెసేజ్ ఇవ్వాల‌నే  కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా తీశాన‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఈ స‌మాధానం చెప్ప‌డంతో మీడియా ప్ర‌తినిధులు ఒక్క‌సారిగా భ‌ల్లున న‌వ్వారు.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారోత్సవం చూసినప్పుడు ఈ సినిమా ఐడియా వచ్చిందని వెల్లడించాడు వర్మ. ఈ సినిమాను రాష్ట్రంలోని  ఓ ప్రముఖ తండ్రి కొడుకులకు అంకిత ఇవ్వనున్నానని చెప్పి అంద‌రి మ‌దిలో ఎవ‌రో  ఆ ఇద్ద‌రిని గుర్తు చేస్తున్నాడు.  

 

ఈ సినిమాను ఆపాలంటూ కొంత‌మంది కోర్టుకు వెళ్లిన విష‌యాన్ని గుర్తు చేయ‌గా త‌న‌ను తిట్టేవాళ్లంటే ఎందుకో అమిత‌మైన ప్రేమ అంటూ వ్య‌గ్యంగా స‌మాధానం ఇచ్చారు. సినిమాలో ప‌ప్పు క్యారెక్ట‌ర్ గురించి ప్ర‌స్తావించగా  ఒక తండ్రిగా కొడుకు కి అన్నం లో పప్పు వద్దించటం తప్పా వ్యంగ్య‌మైన ప్ర‌శ్న‌లు మీడియా ప్ర‌తినిధుల‌కే సంధించ‌డం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: