కమ్మరాజ్యంలో కడప రెడ్లు.. కొంతకాలంగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సినిమా టైటిల్ ఇది. కడప జిల్లాకు చెందిన జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ సినిమా రూపొందిస్తుండటంతో బాగా క్రేజ్ వచ్చింది. అందులోనూ టైటిల్ నేరుగా కులాలపై ఉండటంతో వర్మ ఏం చూపిస్తాడో అన్న ఆత్రుత ప్రేక్షకుల్లో పెరిగింది. దీనికి తోడు వర్మ రిలీజ్ చేసిన ట్రైలర్లు కూడా సంచలనం సృష్టించాయి.

 

సినిమా క్యాస్టింగ్ కూడా బాగా కుదిరింది. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్, కేఏ పాల్ పాత్రలకు తగిన వ్యక్తులు దొరకడంతో సినిమాపై ఇంట్రస్టు అమాంతం పెరిగింది. దీనికి తోడు కథలోనూ వర్మ మంచి ట్విస్టులు పెట్టినట్టు.. ట్రైలర్ల ద్వారా తెలుస్తోంది. గతంలో కేవలం ఇలాంటి విషయాల్లో బయోపిక్కులు మాత్రమే తీసేవాడు వర్మ.. కానీ ఇప్పుడు బయోపిక్కులతో పాటు కాస్త కల్పన కూడా జోడించినట్టున్నాడు.

 

అందుకే జగన్ రాజీనామా చేస్తున్నట్టు కూడా ట్రైలర్లలో చూపాడు. దాంతో ఈ సినిమాలో స్టోరీ ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ పెరిగింది. లోకేశ్ పాత్రను మరీ పప్పుగా చూపించడం.. ఆయనపై ఏకంగా ఓ పాట కూడా పెట్టడం విమర్శల పాలైంది. అయితే సరిగ్గా సినిమా విడుదల ఒక రెండు రోజులు ఉందనగా.. సినిమా టైటిల్ ను అనూహ్యంగా మార్చేశాడు రామ్ గోపాల్ వర్మ.

 

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు కాస్తా.. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలుగా మారిపోయింది. సాధారణంగా ఇలాంటి విషయాల్లో వెనక్కు తగ్గని వర్మ.. నేరుగా కులాల పేరుతోటైటిల్ ఉంటే సెన్సార్ ప్రాబ్లం వస్తుందని చివర్లో తగ్గినట్టు కనిపిస్తున్నారు. మొత్తానికి టైటిల్ లోనుంచి కమ్మలు. రెడ్లు వెళ్లిపోవడంతో అప్పటి వరకూ ఉన్న క్రేజ్ కాస్త తగ్గినట్టే కనిపిస్తోంది. మరి వర్మ సినిమాలో ఏం చూపించాడు.. ఏ ఏ సీన్లు సెన్సార్ అయ్యాయి అన్నది మరో రెండు రోజుల్లో తేలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: