దక్షిణ ఆఫ్రికా మాదిరిగా ఆంధ్రప్రదేశ్ లో మూడు ప్రాంతాలలో మూడు రాజధానులు అమరావతి విశాఖపట్నం కర్నూల్ లో ఉండబోతున్నాయి అని నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ స్వయంగా చెప్పడంతో ఇప్పుడు ఈ విషయం రాజకీయాలలోనే కాకుండా సాధారణ ప్రజానీకం మధ్య కూడ పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పుడు ఈ విషయమై పవన్ కళ్యాణ్ జగన్ ను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ హాట్ న్యూస్ గా మారాయి. 

‘తినడానికి మెతుకు లేక తండ్రి ఏడుస్తుంటే కొడుకు వచ్చి పరవాన్నం కావాలి అని అడిగాడట అలాగ ఒక అమరావతి రాజధానికి దిక్కు దివానం లేదు ఇప్పటి దాకా. మరి జగన్ రెడ్డి గారు మూడు అమరావతి నగరాలు అసలు అయ్యేనా ? పాలకుల వలన రాష్ట్ర విభజన మొదలుకుని ఇప్పటి దాకా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అనిశ్చితి అశాంతి అబద్రత తప్ప ఇంకేమి ఒరగలేదు’ అంటూ పవన్ చేసిన ట్విట్ ఇప్పుడు రాజకీయ వర్గాలలో పెను దుమారాన్ని సృష్టిస్తోంది. 

ఇప్పటి దాక ఇంగ్లీష్ మీడియం విద్య పై జగన్ తీసుకున్న నిర్ణయం పై జనం మధ్య పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ కు మరొక అస్త్రం దొరికినట్లుగా అనిపిస్తోంది. దీనితో ఈ విషయమై ప్రజల మధ్య మరింత మమేకం అవుతూ పవన్ తన నిరసన యాత్రను చేపట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. 

ఒక వైపు ‘పింక్’ రీమేక్ కు రంగం సిద్ధమై పవన్ డేట్స్ గురించి దిల్ రాజ్ ఎదురు చూస్తుంటే పవన్ లేటెస్ట్ గా ఈ మూడు రాజధానుల ముచ్చట పై చేపట్టబోతున్న నిరసన కార్యక్రమాల వల్ల పవన్ సినిమా రీ ఎంట్రీ ఆలస్యం అయ్యే ఆస్కారం కనిపిస్తోంది. అయితే రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలంటే రాజధాని ఒక చోట కాకుండా కనీసం రెండు చోట్ల ఉంటే అధికార వికేంద్రీకరణ జరిగి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అన్న అభిప్రాయాలు మరికొందరు వ్యక్త పరుస్తున్నారు. అయితే జనం మధ్యకు రావడానికి మీడియాలో నిరంతరం కనిపించడానికి పవన్ కళ్యాణ్ కు మరొక అవకాసం దొరికింది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: