బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన ద‌బాంగ్ సీరిస్ సినిమాల‌కు ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ద‌బాంగ్ సినిమా స‌ల్మాన్ రేంజ్ మొత్తం మార్చేసింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన ద‌బాంగ్ 2 సినిమా సైతం బాగానే ఆడింది. ఇక ఈ సీరిస్‌లో భాగంగా ఇప్పుడు ద‌బాంగ్ 3 సినిమా వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా అటు హిందీతో పాటు ఇటు తెలుగులోనూ ఈ శుక్ర‌వారం భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ద‌బాంగ్ 3 తెలుగు వెర్ష‌న్ ను ప్ర‌ముఖ నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్ సురేష్ బాబు రిలీజ్ చేస్తున్నారు.

 

సినిమా రిలీజ్ కు మ‌రికొన్ని గంట‌లే ఉన్న వేళ షాక్ త‌గిలింది. ‘దబాంగ్ 3’ సినిమాపై హిందూ జాగృతి సమితి అభ్యంతరం వ్యక్తం చేసింది. దబాంగ్ 3 సినిమాలోని పాటతో పాటు కొన్ని సన్నివేశాల్లో సాధువులను కించపర్చారని, వాటిని ఈ సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. శుక్ర‌వారం దబాంగ్ 3 సినిమా విడుదల చేయనున్నందున సాధువులను కించపర్చే సన్నివేశాలు, పాటను తొలగించాలని ముంబై సెన్సార్ బోర్డ్, మహారాష్ట్ర ప్రభుత్వాలను హిందూ జాగృతి సమితి కోఆర్డినేటర్ సునీల్ ఘన్వాట్ డిమాండ్ చేశారు.

 

అక్క‌డితో ఆగ‌ని ఈ జాగృతి క‌మిటీ స‌భ్యులు వార్నింగ్ కూడా ఇచ్చారు. ద‌బాంగ్ 3లో అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించకుంటే తమ కార్యకర్తలు సినిమా హాళ్ల వద్ద నిరసన ప్రదర్శనలు చేస్తారని సునీల్ హెచ్చరించారు. మరి వీరి హెచ్చ‌రిక‌ల‌కు ద‌బాంగ్ 3 యూనిట్ వెన‌క్కు త‌గ్గుతుందా ?  లేదా అలాగే ముందుకు వెళుతుందా ? అన్న‌ది చూడాలి. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హాలు హీరో హీరోయిన్ లుగా నటించారు. 2012 వచ్చిన దబాంగ్ 2 కు ఇది సీక్వెల్. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, అర్బాజ్ ప్రొడక్షన్స్ లో నిర్మించిన ఈ సినిమాకు డైరెక్టర్ ప్రభుదేవా.

మరింత సమాచారం తెలుసుకోండి: