పవన్ కెరియర్ కు పునాది వేసింది చిరంజీవి అనడంలో ఎటువంటి సందేహం లేదు. పవన్ పవర్ స్టార్ గా మారేంత వరకు చిరంజీవి అభిమానులే పవన్ అభిమానులు. అయితే పవన్ చిరంజీవి తమ్ముడుగా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకుని నటించినవి కేవలం 25 సినిమాలు మాత్రమే అయినా ఒకానొక స్థాయిలో పవన్ చిరంజీవి స్థాయిని దాటిపోతాడా అన్న సందేహాలు కలిగేలా పవన్ గ్రాఫ్ కొనసాగింది.

అయితే పవన్ కు సినిమాల పై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో పాటు అతడు తన సినిమాల ఎంపికలో చేసిన కొన్ని చిన్నచిన్న పొరపాట్లు వల్ల పవన్ కెరియర్ పడుతూ లేస్తూ ఒక హిట్ వస్తే ఆ తరువాత మూడు ఫెయిల్యూర్ లు వస్తు కొనసాగింది. అయితే పవన్ అభిమానులు మాత్రం అతడి జయాపజయాలతో సంబంధం లేకుండా అతడికి భక్తులుగా ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రాలలో లక్షల సంఖ్యలో కొనసాగుతూనే ఉన్నారు. 

ప్రస్తుతం పవన్ ఎన్నికలలో ఓటమి చెందినా జనం మధ్యనే తిరుగుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ముఖ్యంగా జగన్ ను టార్గెట్ చేస్తూ అనేక విమర్శలు చేస్తున్నాడు. నిన్న మొన్నటి వరకు ఇంగ్లీష్ మీడియం విద్య జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టి తెలుగును నిర్లక్ష్యం చేస్తోంది అంటూ పోరాటం చేసిన పవన్ జగన్ ప్రభుత్వం లేటెస్ట్ గా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన మూడు రాజధానుల నిర్ణయం పై తీవ్ర విమర్శలు చేసాడు. 

అయితే ఇప్పుడు చిరంజీవి రంగంలోకి దిగి జగన్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం బాగుంది అంటూ ఓపెన్ గా ప్రశంసలు కురిపించడంతో పవన్ కు చిరంజీవి అనుకోని తలనొప్పిగా మారుతున్నాడా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకవైపు జగన్ ను టార్గెట్ చేస్తూ పవన్ విమర్శిస్తూ ఉంటే ఆమధ్య చిరంజీవి జగన్ ను వ్యక్తిగతంగా కలిసి ‘సైరా’ సినిమాను చూడమని ఆహ్వానించడం ఇప్పుడు ఏకంగా రాజధానుల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం బాగుంది అంటూ చిరంజీవి ప్రశంసలు కురిపించడం చూస్తుంటే ఈ అన్న దమ్ములు ఇద్దరు వ్యూహాత్మకంగా రాజకీయాలలో సేఫ్ గేమ్ ఆడుతున్నా వీరిద్దరి ప్రవర్తన వల్ల జనం కన్ఫ్యూజ్ అవుతూ పవన్ ఇమేజ్ మరింత తగ్గడమే కాకుండా ఒక విధంగా చిరంజీవి సేఫ్ గేమ్ పవన్ కు భారంగా మారిపోతుందా అంటూ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్త పరుస్తున్నారు..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: