తమిళ నటుడు సత్యరాజ్ తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించినా గుర్తింపు మాత్రం బాహుబలి సినిమాలోని కట్టప్ప పాత్రతోనే వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది సత్యరాజ్ ను ప్రేమగా కట్టప్ప అనే పిలుస్తారు. విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్న సత్యరాజ్ ఇటు నలభై ఏళ్ల వయస్సు గల తండ్రి పాత్రలోకి, అటు 80 ఏళ్ల వయస్సు గల ముసలివాడి పాత్రలోకి సులభంగా మారిపోగలరు. 
 
ప్రతిరోజూ పండగే సినిమాలో ఎనభై ఏళ్ల ముసలివాడి పాత్రలో కనిపించి మెప్పించిన సత్యరాజ్ అద్భుతమైన అభినయంతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. తమిళంలో 125 సినిమాల్లో నటించిన సత్యరాజ్ సినిమాల్లో అవకాశాల కోసం పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అనుకున్నది సాధించిన తరువాతే ఇంటికొస్తానని తన పెద్దనాన్న కొడుకు శివ దగ్గర కొంత డబ్బు తీసుకుని స్టూడియోల చుట్టూ తిరగడం ప్రారంభించాడు. 
 
ఎంజీఆర్ కు వీరాభిమాని అయిన సత్యరాజ్ అతని డైలాగులను కంఠతా చెప్పేవారు. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ తన ఊరి వాడైన శివకుమార్ (సూర్య నాన్న) ను కలిశారు. శివకుమార్ ప్రోత్సాహంతో రంగస్థల నాటక సంస్థలో చేరిన సత్యరాజ్ 15 రోజుల్లో 30 రూపాయలు సంపాదించారు. మొదట్లో సినిమా ప్రొడక్షన్ అసిస్టెంట్ గా అవకాశం అందుకున్న సత్యరాజ్ ఆ తరువాత ఒక సినిమాలో స్టంట్ మ్యాన్ గా చిన్న పాత్రలో నటించారు. ఆ తరువాత కమల్ హాసన్ సినిమాలో చిన్న పాత్రలో నటించి సత్యరాజ్ 500 రూపాయలు పారితోషికంగా అందుకున్నారు. 
 
ఆ తరువాత కొన్ని కారణాల వలన సత్యరాజ్ తన మరదలిని పెళ్లి చేసుకున్నాడు. ఇల్లు గడవటానికి సినిమాల నుండి వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో ఐస్ క్రీమ్ పార్లర్ పెడితే లాభాలుంటాయని చెన్నై మెయిన్ సెంటర్ లో ఐస్ క్రీమ్ పార్లర్ పెట్టాడు సత్యరాజ్. సత్యరాజ్, అతని భార్య పార్లర్ లో ఐస్ క్రీములు అమ్మారు. ఐస్ క్రీమ్ వ్యాపారంలో భారీగా నష్టాలు రావటంతో పాత ఇనుప సామాన్ల వ్యాపారం మొదలుపెట్టారు. ఆ వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చినా రజనీ, కమల్ లాంటి హీరోలకు విలన్ గా నటించి సినిమాల్లో సత్యరాజ్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత వరుస అవకాశాలతో బిజీ అయిన సత్యరాజ్ ప్రస్తుతం తెలుగు, తమిళంలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: