ప్రజలకు శాంతి ప్రేమ కరుణ దయా గుణాలను అందించి మానవరూపంలో దైవంగా మన  అందరి మధ్య నడయాడిన కరుణామయుడు యేసుక్రీస్తు జన్మదినాన్ని క్రిస్మస్‌ పండుగగా నిర్వహించకోవడం అనాదిగా వస్తోంది. సమాజంలోని సర్వమానవాళిని సమానంగా చూడాలని బోధనలు చేసిన యేసుక్రీస్తు మానవ రూపంలో మన మధ్య నడయాడిన మహోన్నత వ్యక్తి. రెండువేల ఏళ్ల క్రితం ఇజ్రాయిల్‌ దేశంలోని బెత్లెహాంలో పశువుల పాకలో కన్య అయినటువంటి మరియకు యేసుక్రీస్తు జన్మించాడని చరిత్ర చెబుతోంది. 

పశువుల పాకలో జన్మించిన యేసుక్రీస్తు చిన్నప్పటి నుండే దైవ బోధనలను తెలియజేస్తూ కుల మత జాతి లింగ భేదం లేకుండా ఆపదలో ఉన్న వారికి ఆశ్రయమిస్తూ అద్భుతాలను చూపించిన మహోన్నత వ్యక్తి. మహిమల ద్వారా మానవాళి మనుగడకు తోడ్పడుతూ సన్మార్గం వైపు పయనించేలా ప్రజలకు బోధనలను చేసాడు జీసస్. తన ముప్పైమూడున్నర ఏళ్ల జీవితంలో అనేక అద్భుతాలను ప్రజలకు అందించిన ఏసుక్రీస్తు ను త్యాగానికి చిహ్నంగా అన్ని మతాల వారు ప్రపంచ వ్యాప్తంగా ఆయన గొప్పతనం గురించి క్రిస్మస్ రోజున మాత్రమే కాదు ప్రతిరోజు స్మరించు కుంటూనే ఉంటారు. 

డిసెంబర్ నెల రాగానే ప్రపంచం యావత్తు క్రిస్మస్ సందడి ప్రారంభమైపోతుంది. అందరి ముంగిళ్లలోనూ క్రిస్మస్ ట్రీలు ప్రత్యక్షమవుతాయి. ఈ క్రిస్మస్ వేడుకలలో  ప్రధాన ఆకర్షణ క్రిస్మస్ చెట్టుదే. మరి క్రిస్మస్ చెట్టు ఎలా పుట్టింది దాని ప్రాముఖ్యత ఏమిటి అన్న విషయాలను పరిశీలిస్తే అనేక ఆశ్చర్యకర విషయాలు మనకు తెలుస్తాయి. పచ్చని మొక్కలు చెట్లతోనే మనిషి జీవితం ముడిపడి ఉంది. అటువంటి చెట్టుని మనుషులు ఆరాధించడం సాంప్రదాయంగా మారింది. క్రిస్మస్ చెట్టు ఇంట్లోపెట్టుకునే సాంప్రదాయం జర్మన్‌ ల నుంచి వచ్చిన సాంప్రదాయమని చరిత్రకారులు చెపుతారు. 

ఆ తరువాత క్రమేపీ క్రిస్మస్ చెట్టు ఆచారం జర్మన్ నుంచి  బ్రిటన్‌ కి వచ్చింది. బ్రిటన్ లో ఆ చెట్టుకి రకరకాల కొవ్వొత్తులు స్వీట్లు వంటివాటితో పాటు గిఫ్ట్స్ ను కూడ పెట్టి డెకరేట్ చేయడం ప్రారంభించారు. అలా ఈ సాంప్రదాయం కెనడాలోకి కూడా వచ్చింది. ఆతరువాత దాదాపు 100 సంవత్సరాలకు అమెరికాలోకి అడుగుపెట్టింది. బ్రిటీష్ వలస రాజ్యంగా మన ఇండియా 200 సంవత్సరాల పాటు బ్రిటీష్ పాలకుల పాలనలో ఉండటంతో మన ఇండియాలో కూడ మతాలతో సంబంధం లేకుండా క్రిస్మస్ ను ఒక పండుగలా జరుపుకోవడం మన సంస్కృతిలో ఒక భాగంగా మారిపోయింది. మానవాళి అభ్యున్నతి కోసం తన రక్తాన్ని చిందించి శిలువ పై తన ప్రాణాన్ని వదిలిన జీసస్ ప్రపంచ మానవాళి ఉన్నంత వరకు జీసస్ త్యాగాన్ని గుర్తికు చేసుకుంటూ జాతి మత వర్గ వివక్షత లేకుండా క్రిస్మస్ ను జరుపుకుంటూనే ఉంటాము. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇండియా హెరాల్డ్ అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: