ప్రతి సంక్రాంతికి సినిమాల సందడి ఎక్కువగా ఉంటుంది. ఆ పోటీ ఎలా ఉంటుందంటే సంక్రాంతి పుంజుల్లా పోటీ పడతాయి. హిట్ల కోసం హీరోల తాపత్రయం, రికార్డుల కోసం ఫ్యాన్స్ ఆరాటం, టికెట్లు తెగాలని డిస్ట్రిబ్యూటర్ల ఆరాటం, ప్రతి సినిమా చూడాలని ప్రేక్షకుల ఆరాటం.. ఇలా సంక్రాంతి పండుగ సంబరాలను సినిమాలు ఆక్రమించేస్తూంటాయి. ఓ దశాబ్దం క్రితం వరకూ సంక్రాంతికి సినిమాలు విడుదలయ్యేవి కానీ.. ఇంతటి పోటీ ఉండేది కాదు. ప్రస్తుతం ఈ సంక్రాంతికి కూడా నాలుగు సినిమాలు పోటీ పడుతున్నాయి.

 

 

గత ఏడాదిలానే ఈ సంక్రాంతికి కూడా మూడు తెలుగు సినిమాలు ఓ డబ్బింగ్ సినిమా వస్తున్నాయి. 2019లో రజనీకాంత్ పేట వస్తే.. ఇప్పుడూ రజినీ సినిమా దర్బార్ ధియేటర్లలో సందడి చేస్తోంది. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా నిన్న ధియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాపై మిక్సిడ్ రెస్పాన్స్ వస్తోంది. ఫస్టాఫ్ బాగున్నా సెకండాఫ్ తట్టుకోలేకపోతున్నారని సినిమా ఫలితంపై సెకండాఫ్ తీవ్ర ప్రభావం చూపిందని అంటున్నారు. దీంతో రేపు, ఎల్లుండి వస్తున్న మహేశ్ సరిలేరు నీకెవ్వరు, బన్నీ అల.. వైకుంఠపురంలో, 15న వస్తున్న ఎంత మంచివాడవురా.. సినిమాలకు మార్గం సుగమం చేసిందంటున్నారు. అసలే ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు, ఓ కుటుంబ కథా చిత్రం.. కావడంతో ఈ సినిమాలు ఏమాత్రం హిట్ టాక్ తెచ్చుకున్నా దర్బార్ ఇక కష్టమేనంటున్నారు.

 

 

సినిమాలో రజినీ స్టైల్, మేనియా తప్ప కథగా చెప్పడానికి కూడా ఏమీ లేదంటున్నారు. కథపై దర్శకుడు మురుగదాస్ పెద్దగా దృష్టి పెట్టకపోవడం వల్లనే సెకండాఫ్ తేడా కొట్టిందంటున్నారు. రాబోయే సంక్రాంతి సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. రజనీ దర్బార్ పండుగ కలెక్షన్ల వరకూ ఓకే కానీ తర్వాత కష్టం అంటున్నారు. ఈ పండుగ సీజన్లో కూడా రికవరీ సాధ్యమవుతుందో లేదో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: