కలానికి పదునున్నోడు.. ఎప్పటికీ పడిపోడు.. అని డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి నిరూపించాడు. ఇప్పుడు అల వైకుంఠపురములో సినిమా ద్వారా సత్తా చాటాడు. డైలాగులు, దర్శకత్వం, కథ.. అన్నింటిలోనూ తనదైన మార్కు చూపించాడు. అందుకే త్రివిక్రమ్ పడిలేచిన కెరటం అయ్యాడు. అజ్ఞాత‌వాసి త‌ర్వాత మ‌నోడి ప‌ని అయిపోయింద‌న్న విమ‌ర్శలు బాగా వ‌చ్చాయి.

 

అజ్ఞాతవాసి తర్వాత అర‌వింద స‌మేత‌తో ఓ మోస్తరు హిట్‌ వచ్చింది. ఇప్పుడు అల వైకుంఠపురము ఏమవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూశారు. ఇప్పుడు అల సినిమాతో త‌న పెన్నుకు ప‌దును త‌గ్గలేద‌ని త్రివిక్రమ్ మరోసారి ఫ్రూవ్ చేసుకున్నాడు. ఈ సమయంలో కొందరు డైరెక్టర్లను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినీరంగంలో జయాపజయాలు సహజం.

 

కానీ కొందరు గతంలో ఎన్ని హిట్లు ఇచ్చినా.. ఆ తర్వాత ఫ్లాపులతో తెరమరుగయ్యే పరిస్థితిలో ఉన్నారు. కొంద‌రు ప్లాప్‌ డైరెక్టర్లు గ‌తంలో త్రివిక్రమ్‌తో పాటు ఓ వెలుగు వెలిగి.. ఇప్పుడు ఫామ్‌లో లేక వ‌రుస ప్లాపుల‌తో పాతాళానికి ప‌డిపోయారు. వాళ్లుత్రివిక్రమ్‌ను చూసి నేర్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.

 

గతంలో సినిమాల్లో హాస్యం గుప్పించడంలో ఎంతో దూకుడు ప్రదర్శించిన ఓ దర్శకుడు ఆ తర్వాత వరుస ఫ్లాపులతో క్రమంగా తెరమరుగయ్యాడు. ఇప్పుడు అవకాశాలు లేక డీలా పడ్డాడు. మరో డైరెక్టర్ మాస్ హీరోయిజంతో ఆకట్టుకుని.. ఏకంగా హిట్లతో అలరించాడు. మెగాస్టార్లను సైతం డైరెక్ట్ చేసి శెభాష్ అనిపించుకున్నా.. ఆ తర్వాత హిట్లు లేక.. ఏకంగా మెగా ఫోన్ వదిలేసి మేకప్పు వేసుకునే పనిలో పడిపోయాడు.

 

మరో డైరెక్టర్ ఏకంగా యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు.. కానీ ఒకే ఒక్క ఫ్లాప్ తో అయ్యో రామా.. అనే పరిస్థితిలో చిక్కుకుపోయాడు. మరో అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో ఉన్నాడు. ఇలాంటి ఫ్లాప్ డైరెక్టర్లంతా.. త్రివిక్రమ్ ను చూసి నేర్చుకోవాలంటున్నాడు సగటు సినీ అభిమాని.

మరింత సమాచారం తెలుసుకోండి: