ప్రకృతిని పులకరింప చేసే పండుగ సంక్రాంతి. తెలుగువారి పెద్ద పండుగగా మూడు రోజులు జరుపుకునే ఈ పండుగను పెద్ద పండుగగా శ్రీనాథ మహాకవి తన పద్యాలలో అప్పటి సంక్రాంతి వైభవాన్ని వర్ణించాడు. భోగి మంటలు లేకుండా ‘భోగి’ ప్రారంభం కాదు. గొబ్బెమ్మల పూజలో ఆవు పేడతో గోబ్బమ్మలను చేసి వాటిని పసుపు కుంకుమ పూలతో అలంకరించి పెళ్ళికాని కన్నె పిల్లలు ఆ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాడే పాటలు వీనుల విందుగా ఉంటాయి.


అడుగడుగునా తెలుగువారి సంస్కృతిని ప్రతిబింబించే సంక్రాంతి పండుగ మొదటిరోజున వచ్చే ‘భోగి’ నాడు ఇంటి ముందు భోగిమంట వేస్తే ఇంటిలో ఉండే దారిద్ర్య దేవతను తరిమినట్లేనని మన విశ్వాసం. దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు భోగి మంటలు. భోగి రోజు సాయంత్రం పిల్లలకు పోసే భోగి పళ్ళతో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి దివ్యమైన ఆశీస్సులు పొందుతారు. 

‘భుగ్’ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పూర్వం ఈ రోజున శ్రీరంగనాధస్వామి లో గోదాదేవి లీనమై భొగాన్ని పొందిందని దీనికి సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందని పెద్దలు చెపుతూ ఉంటారు. మరి కొందరైతే బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింద అని చెపుతూ ఉంటారు. ముఖ్యంగా పల్లెలలో కులాలకు అతీతంగా అందరు ఈ భోగి మంటల దగ్గర చేరడంతో ప్రజల మధ్య అంతరాలను తగ్గించి  ఐక్యతను పెంచుతుంది అనే అంతరార్ధం కూడ ఈ భోగి మంటలలో ఉంది. 

భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులని కాదు మనలోని పనికి రాని అలవాట్లు చెడు లక్షణాలు. అప్పుడే మనకు మానసిక ఆరోగ్యం కలిగి చేసే పనిలో విజయాలను పొందగలుగుతాము. ఈ భోగి పండుగ రోజు నుండి కోస్తా జిల్లాలలో కోడి పందాలు ప్రారంభం అవుతాయి. తెలంగాణాలో ఈరోజును పతంగుల పండుగగా జరుపుకుంటారు. ఒకప్పుడు ప్రతి ఇంటిలోనూ కనిపించే బొమ్మల  కొలువులు ఇప్పుడు కనపడకపోయినా సంక్రాంతి సరదాలు ఇప్పటికీ కోస్తా జిల్లాలలోని పల్లె ప్రాంతాలలో కనిపిస్తూనే ఉంటాయి. ఈ భోగి పండుగ నాడు ప్రతి ఇల్లు భోగభాగ్యాలతో తులతూగాలని అని కోరుకుంటూ ఇండియా హెరాల్డ్ తెలుగు వారందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: