రాజేంద్రప్రసాద్.. ఈ పేరు వినగానే మన ముఖాలపై ఓ నవ్వు విరుస్తుంది. అంతగా ఆయన హ్యస్యానికి పర్యాయపదంగా మారారు. నటకిరీటిగా పేరు తెచ్చుకున్నారు. మరి ఇంతకీ రాజేంద్రప్రసాద్ ఎందుకు కామెడీ హీరో అయ్యారు. హాస్యాన్ని ఎందుకు ఎంచుకున్నారు. దీనికి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది. దాన్ని ఆయనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.

 

అదేంటో ఆయన మాటల్లోనే విందాం.. “ మా కృష్ణాజిల్లా నిమ్మకూరు. నందమూరి తారక రామారావుగారి ఇంట్లో పుట్టా. ఎన్టీఆర్‌గారి ఇంట్లో 24ఏళ్లు ఉన్నా. అప్పటికే ఆయన స్టార్‌ హీరో. చిన్నప్పుడు ఆయన షూటింగ్‌లు చూడటానికి అప్పుడప్పుడూ చెన్నై వెళ్లేవాడిని.నేను ఇంజినీరింగ్‌ ఫస్ట్‌ క్లాస్‌లో పాసయ్యా. అయితే, వయసు తక్కువగా ఉండటంతో ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో ఇంటికి వచ్చేశా. అప్పుడు ఎన్టీఆర్‌ ‘తాతమ్మకల’షూటింగ్‌ విజయవాడలో జరుగుతుంటే నాన్నతో కలిసి వెళ్లా. ‘ఏం చేస్తున్నారు’ అని ఎన్టీఆర్‌ అడిగారు.

 

ఇంజినీరింగ్‌ ఫస్ట్‌ క్లాస్‌లో పాసయ్యా. అయితే, సినిమాల్లో నటిద్దామని అనుకుంటున్నా’ అన్నాను. అప్పుడు త్రివిక్రమరావుగారిని పిలిచి నన్ను యాక్టింగ్‌ స్కూల్లో చేర్పించారు. అక్కడ నటనలో గోల్డ్‌మెడల్‌ వచ్చింది. ఎన్టీఆర్‌ కూడా మెచ్చుకున్నారు. అయితే, ‘పౌరాణికం చేయడానికి మేమున్నాం, సాంఘిక చిత్రాలు చేయడానికి బ్రదర్‌ అక్కినేని, ఫైటింగ్‌ చిత్రాలకు కృష్ణ, రొమాంటిక్‌ సినిమాలకు శోభన్‌బాబు ఉన్నారు. మీరేం చేస్తారు’ అని అడిగారు. ఆయన ప్రశ్నే నేను కామెడీ హీరో అయ్యేలా చేసింది.. అంటూ గతం గుర్తు చేసుకున్నారు రాజేంద్రప్రసాద్.

 

మరో తమాషా సన్నివేశం కూడా చెప్పారు. అదేంటంటే.. ఒకరోజు గుర్రపు స్వారీ షూటింగ్‌ ఉందంటే చూద్దామని వెళ్లి చూసి షాకయ్యారట. ఎన్టీఆర్ చెక్క మీద కూర్చొని వెనక్కీ.. ముందుకీ ఊగుతూ, నుదుటిపై ఉన్న చెమటను తుడుచుకుంటున్నారట. వెంటనే రాజేంద్రప్రసాద్.. ‘గుర్రంపై వెళ్తుంటే గాలి వస్తుంది కదా! చెమట ఎలా పడుతుంది’ అని అన్నారట. ఎన్టీఆర్ వెంటనే నవ్వి.. వీరిని తీసుకెళ్లి ఏమి కావాలో అది తాగించండి’ అన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: