నందమూరి నటవారసుడిగా తెలుగు వెండితెరకు పరిచయం అయిన యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ తనదైన స్టార్‌ ఇమేజ్‌తో ఒక్కో మెట్టూ ఎక్కుతూ వస్తున్నాడు. ఇప్పటికే టాలీవుడ్‌లో టాప్‌ హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న తారక్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్‌ సినిమాలో నటిస్తున్నాడు. గతంలో ఎన్టీఆర్‌కు స్టూడెంట్‌ నెంబర్‌ 1, సింహాద్రి, యమదొంగ లాంటి హిట్స్‌ ఇచ్చిన రాజమౌళి ఎన్టీఆర్‌కు మరో బిగ్ హిట్ ఇస్తాడన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్‌.


అయితే ఇదంతా బాగానే ఉన్నా.. ఎన్టీఆర్‌ అభిమానులకు మాత్రం గట్టి షాక్‌ ఇచ్చాడు రాజమౌళి. ఈ సినిమా కోసం మరో ప్రాజెక్ట్‌ ఒప్పుకోకుండా బల్క్‌ డేట్స్‌ ఇచ్చాడు ఎన్టీఆర్‌. గత ఏడాది ప్రారంభమైన ఈ సినిమాను ఈ సంవత్సరం జూలై 30న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. కానీ షూటింగ్‌ ఆలస్యమవుతుండటంతో రిలీజ్‌ డేట్‌ను వాయిదా వేశారు చిత్రయూనిట్. ముందుగా అనుకున్నట్టుగా ఈ ఏడాది కాకుండా 2021 జనవరిలో సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.


దీంతో ఎన్టీఆర్‌ అభిమానులు షాక్‌ అయ్యారు. ఆర్‌ఆర్‌ఆర్‌లో చేస్తున్న కొమరం భీం పాత్ర కోసం గత ఏడాది అంతా సినిమాలు చేయకుండా సిద్ధమైన ఎన్టీఆర్‌ ఈ ఏడాది కూడా మరో సినిమా చేసే అవకాశం లేదని తెలుస్తోంది. అంటే ఎన్టీఆర్‌ కెరీర్‌లో తొలిసారి రెండేళ్ల పాటు విరామం వచ్చింది. గతంలో 2009లో ఎన్టీఆర్‌ ఒక్క సినిమాను కూడా రిలీజ్ చేయలేదు. ఇప్పుడు ఏకంగా రెండేళ్లపాటు ఎన్టీఆర్‌ సినిమా లేదన్న వార్తలో అభిమానులు నిరాశలో మునిగిపోయారు.


ఎన్టీఆర్‌ సరసన హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్‌ నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్‌ మరో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. రామ్‌ చరణ్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తోంది. దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్ హీరో అజయ్‌ దేవగన్‌, తమిళ విలక్షణ నటుడు సముద్రఖనిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: