ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమా అంటే నిర్మాతలు క్యూ కట్టేవారు. అది కూడా హీరో మంచి ఫాంలో ఉంటే ఇక పండగే. ఎలాగైనా నెక్ట్స్ సినిమాను ఓకె చేయించుకొని నాలుగు కాసులు వెనకేసుకుందామనుకునేవారు. కానీ ఇప్పుడు సీన్‌ మారిపోయింది. స్టార్ హీరోతో సినిమా అంటే నిర్మాతలకు తలకు మించి భారంగా మారుతోంది. సినిమా బడ్జెట్‌కు మించి హీరోలు పారితోషికాలు తీసుకుంటుండటంతో సినిమా బడ్జెట్ తడిసిమోపడేవుతోంది. ఇక స్టార్ హీరో ఫ్యాన్స్‌ను సాటిస్ఫై చేసే స్థాయిలో అవుట్‌పుట్ ఇవ్వడానికి కూడా భారీ మొత్తం ఖర్చవుతోంది. 


హీరో వాల్యూకి తగ్గట్టుగా ఇరత కాస్ట్ అండ్‌ క్రూ ఉండాలి. దీంతో బడ్జెట్ మరింతగా పెరిగిపోతుంది. అన్ని కలుపుకొని స్టార్ హీరో సినిమా బడ్జెట్ 100 కోట్ల మార్క్‌ను అవలీలగా దాటేస్తుంది. మరి కలెక్షన్లు ఆ స్థాయిలో ఉన్నాయా అంటే అనుమానమే. బాహుబలి లాంటి పాన్‌ ఇండియా సినిమాలను పక్కన పెడితే స్టార్ హీరోలు సినిమాల వసూళ్లు ఎంత అన్నది ఇంకా తేలాల్సి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాతలు స్టార్‌ హీరలో పేరు చెపితేనే వణికిపోతున్నారు.

 

నెంబర్‌ వన్‌ ప్లేస్‌ కోసం పోటిపడుతున్న హీరోల విషయంలో నిర్మాతల కష్టాలు మరి ఎక్కువగా ఉంటున్నాయి. ఇటీవల ఓ స్టార్‌ హీరోపై ఏకంగా నో బ్రేక్‌ ఈవెన్ స్టార్‌ అంటూ ఓ పెద్ద సోషల్ మీడియా క్యాంపెయినే నడిచింది. ఆ హీరో చేసిన సినిమాలన్నింటికి వరుగా బ్లాక్‌ బస్టర్‌ హిట్ అన్న టాక్ వచ్చినా సినిమాలు మాత్రం బ్రేక్ ఈవెన్ కాలేదట. మార్కెట్‌ను పట్టించుకోకుండా బడ్జెట్‌ను భారీగా పెంచేయటంతో సినిమాలు కాస్ట్ పెయిల్యూర్స్‌గా మిగిలిపోతున్నాయి.

 

ఇక జాతీయ స్థాయి నటుల విషయంలో ఈ నష్టాలు మరింత  భారీగా ఉంటున్నాయి. జాతీయ స్థాయిలో పేరుతెచ్చుకున్న ఓ సౌత్‌ స్టార్ చేసిన సినిమా ఇటీవల విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాకు హీరో 100 కోట్లకు పైగా, దర్శకుడు 40 కోట్లకు పైగా పారితోషికం తీసుకోవటంతో సినిమా బడ్జెట్ అంచనాలను మించేసింది. దీంతో ఆ సినిమా ఎంత భారీ వసూళ్లు సాధించినా డిస్ట్రిబ్యూటర్లను మాత్రం కాపాడలేకపోయింది. ఇలా స్టార్‌ హీరోల సినిమాలు నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు తలకు మించి భారంగా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: