తెలుగు ఇండస్ట్రీలో ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో దాదాపు పదేళ్ల విరామం తర్వాత చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చారు.  శంకర్ దాదా జిందాబాద్ చిత్రం తర్వాత తన సొంతగా ప్రజారాజ్యం పార్టీ పెట్టిన ఆయన ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ పార్టీ దారుణమైన ఫలితాలు పొందింది.  దాంతో అప్పటి యూపీఏ పాలన కొనసాగుతున్న సమయంలో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు.  అదే సమయంలో కేంద్ర మంత్రి హోదాలో చిరంజీవి కొనసాగారు.  అయితే తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి అధ్వాన్నంగా తయారు కావడంతో ఆయన తిరిగి వెండితెరపై దృష్టి పెట్టారు.  ఈ నేపథ్యంలోనే వివివినాయక్ దర్శకత్వంలో తమిళ్ లో సూపర్ హిట్ అయిన కత్తి రిమేక్ గా ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంలో నటించారు. 

 

ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఈ తర్వాత బ్రిటీష్ వారిని ఎదిరించిన తెలుగు మొట్టమొదటి యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా.. రామ్ చరణ్ నిర్మించారు.  కాకపోతే ఈ మూవీ అనుకున్న విజయం అందుకోలేకపోయింది.  ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంటున్న ప్రముఖ దర్శకులు కొరటాల శివ వినిపించిన కథకు చిరంజీవి ఓకే చెప్పడం.. అది వెంటనే పట్టాలు ఎక్కడం జరిగింది.  ఇటీవల హైదరాబాద్ లో షూటింగ్ కూడా జరుపుకుంది. 

 

తదుపరి షెడ్యూల్ ను రాజమండ్రిలో ప్లాన్ చేశారు. చిరంజీవి .. తదితరులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను రాజమండ్రిలో చిత్రీకరించనున్నారు. రామ్ చరణ్ - నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి  'ఆచార్య' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దేవాలయాల మాఫియాకు సంబంధించిన కథగా ఈ చిత్రం రూపొందుతుందని టాలీవుడ్ టాక్.  వినోదంతో పాటు సామాజిక సందేశాన్ని అందించే ఈ చిత్రాన్ని  ఆగస్టులో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.  వరుస విజయాల దర్శకుడైన కొరటాల నుంచి వస్తున్న చిత్రం కావడంతో, ఈ సినిమా పట్ల అందరిలోను ఆసక్తి వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: