ఇటీవల తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్‌ని ఐటీ, జీఎస్టీ అధికారులు వరుస దాడులతో ఉక్కిరి బిక్కిరి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బుతో పాటు వజ్రాలు, స్థిర ఆస్తి పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా వార్తలు వినిపించాయి. అంతేకాదు మాస్టర్‌ షూటింగ్‌ నుంచి విజయ్‌ను అర్ధాంతరంగా తీసుకెళ్లి విచారణ జరిపిన అధికారులు మరోసారి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు కూడా ఇచ్చారు.

 

బీజేపీ కార్యకర్తలు మరో అడుగు ముందుకు వేసి విజయ్‌ మాస్టర్‌ సినిమా షూటింగ్‌ను కూడా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. విజయ్‌ హీరోగా తెరకెక్కిన మెర్సల్‌ సినిమాలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి అంశాల మీద కీలక వ్యాఖ్యలు చేశాడు విజయ్‌. అందుకు ప్రతీకారంగానే ఈ దాడులు జరగుతున్నాయని విజయ్‌ అభిమానులు ఆరోపిస్తున్నారు. దీంతో తమిళనాడులో సీన్‌, విజయ్‌ వర్సెస్‌ బీజేపీలా మారింది.

 

ఈ దాడుల గురించి విజయ్‌ ఇంతవరకు స్పందించలేదు. అయితే తాజాగా పబ్లిక్‌ ఈవెంట్‌కు హాజరైన విజయ్‌ వేలాది మంది అభిమానులతో కలిస ఓ సెల్ఫీ దిగాడు. అంతేకాదు ఆ సెల్ఫీని తన సోషల్‌ మీడియా పేజ్‌లో కూడా పోస్ట్ చేశాడు. దీంతో విజయ్‌ కావాలనే ఇలా తన బలం చూపిస్తున్నాడని అంటున్నారు నెటిజెన్లు. విజయ్‌ ఎవరికీ తలవంచే రకం కాదని అందుకే బీజేపీ కౌంటర్‌గానే తన బలం చూపిస్తూ ఈ సెల్ఫీని పోస్ట్ చేశాడంటున్నారు విశ్లేషకులు.

 

ఇటీవల బిగిల్ సినిమాతో మరో బ్లాక్‌ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న విజయ్‌ ప్రస్తుతం లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్టర్‌ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. సినిమాలతో పాటు సేవ కార్యక్రమాల్లోనూ చురుగ్గా ఉండే విజయ్‌ త్వరలో రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్నాడన్న ప్రచారం చాలా కాలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే విజయ్‌ టార్గెట్‌గా రాజకీయ దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు ఫ్యాన్స్‌.

 

మరింత సమాచారం తెలుసుకోండి: