వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా సినిమాకు మహేష్ బాబు తన మార్కెట్ ను పెంచుకుంటున్నారు. సినిమాల్లో సూపర్ స్టార్ గా అభిమానులను సొంతం చేసుకున్న మహేష్ బాబు రాజకీయాల్లోకి కూడా రావాలని కొంతమంది మహేష్ అభిమానులు కోరుకుంటున్నారు. మహేష్ బాబు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ రాజకీయ నేపథ్యం ఉన్న కథల్లో నటించారు. 
 
భరత్ అనే నేను సినిమాలో సీఎం పాత్రలో మహేష్ నటనకు భారీగా ప్రశంసలు దక్కాయి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలా ఉంటే ఆ రాష్ట్రం బాగుపడుతుందో కళ్లకు కట్టినట్టుగా దర్శకుడు ఆ సినిమాలో మహేష్ ను చూపించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో యాంకర్ మహేష్ బాబును మీరు ఒక్కరోజు సీఎం అయితే ఏం చేస్తారు...? అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు మహేష్ బాబు నవ్వుతూనే తాను ఒక్కరోజు సీఎం అయితే ఏం చేస్తానో తనకే తెలీదని అన్నారు. 
 
తాను సీఎం అయిన రోజున రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలని మహేష్ బాబు చెప్పారు. తన జీవితాన్ని సినిమాలకే పూర్తిగా అంకితం చేస్తానని రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి తనకు లేదని మహేష్ బాబు చెప్పారు. గతంలో కూడా మహేష్ బాబు రాజకీయాల్లోకి రాబోతున్నారని వార్తలు రాగా తాను రాజకీయాల్లోకి రానని మహేష్ బాబు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. యాంకర్ మహేష్ జీవితంపై బయోపిక్ వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారని ప్రశ్నించగా తన జీవితం చాలా బోరింగ్ అని సింపుల్ అని చెప్పారు.తనపై బయోపిక్ ఎవరైనా తీసినా ఆ సినిమా హిట్ కాదని మహేష్ చెప్పారు. 
 
 
గతంలో మహేష్ భార్య నమ్రత కూడా మహేష్ పొలిటికల్ ఎంట్రీ గురించి కామెంట్లు చేశారు. ఇంట్లో ఉన్న తనతోనే మహేష్ బాబు సరిగ్గా మాట్లాడరని రాజకీయాలలో స్టేజ్ పైకి ఎక్కి మహేష్ ఏం మాట్లాడతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు తనకు మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నారు. మహేష్ ఈ సినిమాలో స్పై రోల్ లో కనిపించనున్నారు. మార్చి నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: