పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని హైపర్ ఆది ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో ఆది పవన్ కళ్యాణ్ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియ జేశాడు. పవన్ కళ్యాణ్ ని ప్రతి ఒక్కరు నమ్మాలని ఆయన ఏం చేసినా ప్రజల సంక్షేమం కొరకే చేస్తాడని... అతనికి ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసని చెప్పాడు. జనసేన పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకుంది కదా దీని మీద మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించగా... పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏ సమయంలో ఏది చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందో అటువంటి నిర్ణయమే తీసుకుంటారని చెప్పుకొచ్చాడు.


జనసేన పార్టీ తరఫునుండి మీరు ఎప్పుడు పోటీ చేస్తారు అని ప్రశ్నించగా... తాను సమాధానమిస్తూ... 'పోటీలో నిలబడలేం కానీ పవన్ కళ్యాణ్ కోసం ఏదైనా చేయమంటే వెంటనే చేసేస్తాను. 17, 18 తేదీల్లో జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ వలన ఎన్నికల వాయిదా పడడంతో మా ప్రచారాన్ని కూడా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది' అని తెలిపాడు.


చిరంజీవి ఎలా పార్టీని స్థాపించారో, ఎన్నికలలో ఎలా ఓడిపోయారో, మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఎలా ఇచ్చారో... అలానే పవన్ కళ్యాణ్ జీవితం కూడా కొనసాగుతుంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నించగా... ' పవన్ కళ్యాణ్ ఓడిపోయారని తెలియగానే నాకు ఎంతో బాధ వేసింది. కానీ అంత దారుణమైన ఓటమి ఎదుర్కొన్న తర్వాత కూడా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొనసాగుతూ ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తుండటం నన్ను నిజంగా కదిలించింది. అలాంటి నిజాయితీగల రాజకీయ నేత కోసం మనం ఎన్నేళ్లయినా నిలబడవచ్చు."

 

"ఎవరి పని వారు చేసుకుంటున్న సమయంలో ప్రజలే హీరోలకు మీరు సీఎం కావాలని పూల వర్షం కురిపిస్తుంటారు. జెండాలు పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఏదైనా చిన్న సభ పెడితే లక్షల మంది ప్రజలు తరలి వస్తారు. ఎనలేని అభిమానాన్ని చూపిస్తారు. అలా అన్ని చూపించి సినిమా హీరోల లో సీఎం కావాలనే ఆశని రేపుతారు. చివరికి ఎన్నికలలో తమ ఓట్లను అమ్ముకొని వేరే వాళ్ళని గెలిపిస్తారు. పవన్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఏది ఏమైనా నేను పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని బాగా ఇష్టపడతాను. 12 సినిమాలు వరుసగా ఫెయిలైతే తన క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. అలాంటిది రెండు సీట్లు, నాలుగు ఓట్లు ఓడిపోయిన అంతమాత్రాన తన క్రేజ్ ఇంచు కూడా తగ్గిపోదు' అని ఆయన చెప్పుకొచ్చాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: