ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో పేరున్న సినిమాల డైరెక్ట్ రిలీజ్ దిశగా పెద్ద ముందడుగు పడ్డట్లే. అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద స్టార్, ఆయుష్మాన్ ఖురానా లాంటి సూపర్ ఫామ్‌లో ఉన్న హీరో కలిసి నటించిన ‘గులాబో సితాబో’ సినిమాకు థియేట్రికల్ రిలీజ్ లేకుండానే నేరుగా అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేసేస్తున్నారు. సూజిత్ సిర్కార్ రూపొందించిన ఈ చిత్రం జూన్ 12న ప్రైమ్‌లో రిలీజ్ కాబోతోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రైమ్ వాళ్లే వరల్డ్ ప్రిమియర్ డేట్‌తో పోస్టర్ వదిలేశారు. ‘విక్కీ డోనర్’, ‘మద్రాస్ కేఫ్’, ‘పీకూ’ లాంటి మంచి సినిమాలు తీసిన సూజిత్ సిర్కార్ రూపొందించిన సినిమా కావడం.. అమితాబ్, ఆయుష్మాన్‌ల కలయిక కూడా ఆసక్తి రేపుతుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. 

 

అమితాబ్సినిమా కోసం ఓ కొత్త అవతారంలోకి మారారు. మంచి టాక్ వస్తే రూ.100 కోట్ల వసూళ్లు ఈజీగా సాధించే చిత్రమిది. ఇలాంటి సినిమాను అమేజాన్ ప్రైమ్‌లో డైరెక్ట్‌గా రిలీజ్ చేస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. మరోవైపు నవాజుద్దీన్ సిద్ధిఖి ప్రధాన పాత్రలో నటించిన ‘గూమ్ కేతు’ చిత్రాన్ని జూన్ 22న జీ 5లో డైరెక్ట్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ సినిమా ‘లక్ష్మీ బాంబ్’ సైతం నేరుగా హాట్ స్టార్‌లో రిలీజవుతుందని.. దానికి రూ.90 కోట్లతో డీల్ జరిగిందని కొన్ని రోజుల కిందటే వార్తలొచ్చాయి. 

 

ఇలాంటి పెద్ద సినిమాల్ని ఆన్ లైన్లో డైరెక్ట్‌గా రిలీజ్ చేస్తే ఎలా అన్న ప్రశ్నలు తలెత్తాయి కానీ... ఈ ఏడాది చివరికి కానీ థియేటర్లు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో కాస్త పరిమిత బడ్జెట్లో తెరకెక్కిన చిత్రాల్ని లాభానికి ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు అమ్మేసుకుని బయటపడిపోవాలని నిర్మాతలు చూస్తున్నారు. దక్షిణాది నిర్మాతల్ని ఆలోచనలో పడేసే పరిణామాలే ఇవి. తెలుగులో ‘అమృతారామమ్’ అనే చిన్న సినిమా మాత్రమే నేరుగా ఆన్ లైన్లో రిలీజైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: