రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు లేఖ రాశారు. కరోనా విజృంభణ వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతున్న తరుణంలో పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. వలస కార్మికులకు సొంతూళ్లకు పంపించడానికి తన వంతు కృషి చేస్తానని పోస్ట్ పెట్టారు. దీనికి అందరి సహాయసహకారాలు కావాలని పిలుపునిచ్చారు. 
 
మంచు మనోజ్ తన లేఖలో చిన్నతనం నుంచి పుట్టినరోజు గ్రాండ్ గానే జరిగిందని... ఈ సంవత్సరం కుటుంబ సభ్యులు అందరూ ఉన్నా ఆశీర్వాదం తీసుకోలేని పరిస్థితి నెలకొందని అన్నారు. మీ నాన్న తలుచుకుంటే పాస్ ఎంతసేపు అని చాలా మంది చెబుతున్నారని అలా పాస్ తీసుకుంటే మాత్రం ఈ పుట్టినరోజు అత్యంత హీనమైన పుట్టినరోజుగా గుర్తుండిపోతుందని అన్నారు. కరోనాతో మనం జీవించాలని అందరూ చెబుతున్నారని... కరోనా మొగుడులాంటి వాటితోనే మనం జీవించేశామని చెప్పారు. 
 
సమాజంలో బాంబ్ ఉన్న బ్యాగ్ ను వదిలి వెళ్లి చాలా మందిని చంపేస్తున్న వాళ్లతో కలిసి జీవిస్తున్నామని... వారి కంటే కరోనా ప్రమాదమా...? అని ప్రశ్నించారు. క్వాలిటీ లేకుండా ఫ్లై ఓవర్లు నిర్మిస్తూ వందల మంది ప్రాణాలు పోవడానికి కారణమైన నీచమైన కాంట్రాక్టర్లు సమాజంలో సంతోషంగా జీవిస్తున్నారని... వారి కంటే కరోనా ప్రమాదమా...? అని ప్రశ్నించారు. 
 
మరికొన్ని రోజుల్లో కరోనా తగ్గుముఖం పడుతుందని... అందరం సంతోషంగా ఉండే సమయం త్వరలోనే వస్తుందని చెప్పారు. వలస కార్మికులు తిండి, నీరు లేక రోడ్లపైనే మరణిస్తున్నారని... వాళ్లని గమ్యం చేర్చే బాధ్యత కూడా మనదే అని చెప్పారు. తను చేసే పనికి అభిమానుల సహకారం కావాలని చెప్పారు. ప్రభుత్వాన్ని మోసం చేసే బయట తిరుగుతున్న ప్రతి ఒక్కరికీ కరోనా పాజిటివ్ ప్రాప్తిరస్తు అంటూ మనోజ్ సోషల్ మీడియాలో లేఖ పోస్ట్ చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: