1946 జూన్ 4వ తేదీన జన్మించిన నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈ రోజు తన 74 వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఇతను చిన్నప్పటి నుండి పాటలను బాగా పాడేవాడు. అప్పట్లో ఎన్నో సింగింగ్ ఆడిషన్లకు వెళ్లి తన సొంతంగా రాసుకున్న పాటలను ఆలపించి అందర్నీ ఆశ్చర్యపరిచేవాడు. అప్పట్లో అతను కొంతమందితో కలిసి ఒక మ్యూజికల్ బృందంగా ఏర్పడి ఆర్కెస్ట్రా ఇచ్చేవారు. 


నెల్లూరు, గూడూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే సంగీత పోటీలలో ఈ మ్యూజికల్ బ్యాండ్ పాల్గొని చాలా బహుమతులను సొంతం చేసుకున్నారు. అదే సమయంలో ఎస్.జానకి అతిథిగా వచ్చిన సంగీత పోటీలలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాల్గొని ద్వితీయ బహుమతిని సంపాదించుకున్నాడు. అయితే ఎస్.జానకి సభను ఉద్దేశించి మాట్లాడుతూ తాను న్యాయనిర్ణేతల నిర్ణయాన్ని తప్పు పట్టడం లేదని... కానీ రెండవ బహుమతి సంపాదించిన యువకుడు చాలా బాగా పాట పాడాడని... అతనికి మొదటి బహుమతి ఇవ్వాల్సింది అని చెప్పారు. 


దాంతో ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం తెగ సంతోషపడిపోయి ప్రముఖ నేపథ్య గాయని ఎస్.జానకి మెచ్చుకోదగ్గ టాలెంట్ తనలో ఉందని తెలుసుకున్నాడు. ఎస్. జానకి ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ని తన దగ్గరకు పిలిచి 'బాబు, నీ గాత్రంలో ఏదో ప్రత్యేకత ఉంది. నువ్వు ఎందుకు సినిమాలో ప్రయత్నించకూడదు?! ఆ దిశగా ఒకసారి ప్రయత్నించు', అని చెప్పారు. దాంతో సినిమాలలో పాడాలని బాలసుబ్రహ్మణ్యం అనుకున్నాడు కానీ మంచిగా చదువుకొని ఇంజనీరింగ్ పూర్తి చేస్తే గవర్నమెంటు ఉద్యోగం వస్తుందనే ఉద్దేశంతో తాను చదువుపై ఆసక్తి పెట్టాడు. కానీ puc లో ఒక సబ్జెక్టు తప్పాడు. ఆ తర్వాత మళ్లీ పట్టుదలతో చదివి ఆ సబ్జెక్ట్ పాస్ అయ్యి ఇంజనీరింగ్ సీటు సంపాదించాడు కానీ చదువు కేవలం ఒక సంవత్సరం మాత్రమే చదివి తర్వాత తన చేత కాదని మానేసి నాటకాలలో, సంగీత ప్రదర్శనల లో పాల్గొనడం ప్రారంభించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: