'వాడు పోతే వీడు.. వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే... అప్పలనాయుడు దాదా గిరికొచ్చినా.. దౌర్జాన్యానికొచ్చినా.. గూండాయిజానికొచ్చినా.. గ్రూపులు కట్టడానికొచ్చినా... పూటకో శవం లెక్కన పోర్టుకు బలవుతాయ్‌. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయ్‌', అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. అన్యాయాన్ని ఎదుర్కొనే యోధుడిగా కనిపించే ప్రభాస్ తన నిలువెత్తు విగ్రహం తో రౌడీలతో పోరాడే సన్నివేశాలు రోమాలు నిక్క పొడిచేలా చేస్తాయి. 


2005, సెప్టెంబర్ 29వ తేదీన ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఛత్రపతి సినిమాలో ప్రభాస్, శ్రియ శరన్ హీరో హీరోయిన్ల గా నటించగా... కోటశ్రీనివాసరావు, ప్రదీప్ రావత్, జయప్రకాష్ రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలోని ఎమోషనల్ సన్నివేశాలకు, యాక్షన్ సన్నివేశాలకు అద్భుతంగా సంగీతాన్ని సమకూర్చి వావ్ అనిపించాడు ఎం ఎం కీరవాణి. ఇందులోని సుమ్మమ్మ సురియా, ఏ వచ్చి బి పై వాలె పాటలు కూడా అత్యద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా గుండుసూది గుండుసూది గుచ్చుకుంది గుండుసూది అనే పాటకి కీరవాణి సమకూర్చిన సంగీతం... శ్రియ శరన్ ఒలకబోసిన అందం వెండితెరపై మ్యాజిక్ చేశాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు యాక్షన్ సన్నివేశాలతో, మరోవైపు అమ్మ సెంటిమెంట్ తో పాటు ప్రియురాలి సరసాలు చాలా చక్కగా తెరపై చూపించాడు రాజమౌళి. 


ఈ చిత్రంలో కాట్రాజ్ ఫైట్ సన్నివేశం లో ప్రభాస్ యాక్షన్, ఆసుపత్రిలో కోట శ్రీనివాసరావు తో చోటుచేసుకునే సన్నివేశం, జయప్రకాష్ రెడ్డి హాస్య సన్నివేశాలు, అపరిచితుడి వేషం లో కనిపించిన వేణుమాధవ్ సన్నివేశం, సముద్రంలోని తిమింగలం తో పోరాడే సన్నివేశం హైలెట్ గా నిలిచాయని చెప్పుకోవచ్చు. ఇతర సినిమాలతో పోల్చుకుంటే ప్రభాకర్ డ్యాన్సింగ్ స్కిల్స్ ఈ చిత్రంలో బాగా పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు. చత్రపతి సినిమా ఫస్టాఫ్ లో మొత్తం యాక్షన్ సన్నివేశాలు ఉండగా సెకండాఫ్ లో మాత్రం ఎక్కువగా ఎమోషనల్ సన్నివేశాలు చూపించబడ్డాయి. ఫ్యామిలీ డ్రామా ఇష్టపడే సినీ అభిమానులను, ఫుల్ మాస్ చిత్రాలను ఇష్టపడే అభిమానులనూ చత్రపతి సినిమా బాగా అలరించింది అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: