హాస్యబ్రహ్మ జంధ్యాల దర్శకత్వంలో 1987వ సంవత్సరంలో తెరకెక్కిన అహ! నా పెళ్ళంట! సినిమాలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, నూతన ప్రసాద్, కోట శ్రీనివాసరావు, రజని తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా కథ గురించి తెలుసుకుంటే... శ్రీమంతుడైన సత్యనారాయణ(నూతన ప్రసాద్) భార్య ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి చనిపోతుంది. దాంతో ఒక్కగానొక్క బిడ్డను చాలా గారాబంగా పెంచుతాడు సత్యనారాయణ. ఆ బిడ్డ పేరే కృష్ణమూర్తి(రాజేంద్ర ప్రసాద్) కాగా గారాబం చేయడం వల్ల తను చాలా మొండి వాడిగా తయారవుతాడు. తండ్రి కొడుకులకు ఒకరిపై మరొకరికి కోపం వస్తే ఇంట్లోని అత్యంత ఖరీదైన సమాళ్ళను పోటాపోటీగా పగలగొడతూ ఉంటారు. ఈ సన్నివేశం ద్వారా సత్యనారాయణ ఎంత శ్రీమంతుడో చెప్పకనే చెప్పాడు జంధ్యాల.


అయితే ఒకరోజు కృష్ణమూర్తి ఒక పెళ్లి లో పద్మ(రజని) ఒక అమ్మాయిని చూసి మనసు పారేసుకుంటాడు. ఆపై ఆమెతో మాటలు కలిపి తన ప్రేమను వెల్లడించగా ఆమె కూడా తిరిగి ప్రేమిస్తుంది. ఈ విషయాన్ని తన తండ్రికి చెబుతాడు కృష్ణమూర్తి. కానీ తండ్రి సత్యనారాయణ మాత్రం ప్రేమ పెళ్లికి ససేమిరా అంటాడు. దాంతో కొడుకు కృష్ణమూర్తి బాగా విసిగిస్తాడు. చేసేదేమీలేక ఒక షరతు తో ప్రేమ పెళ్లికి ఒప్పుకుంటాడు సత్యనారాయణ. అలాగే కొడుకు ప్రేమిస్తున్న పద్మ తండ్రి వెంకటపురానికి చెందిన లక్ష్మీపతి అని, అతడు పిల్లికి కూడా బిచ్చం పెట్టని మహా పిసినారి అని తెలుసుకోవడంతో... పద్మ ని చేసుకోవాలంటే నువ్వు ఒక శ్రీమంతుడు కొడుకు అని చెప్పకుండా లక్ష్మీపతి ని ఒప్పించగలవా? అని కృష్ణమూర్తిని సత్యనారాయణ అడగగా... ఒప్పించగలను అంటూ పందెం పెడతాడు కృష్ణమూర్తి. 


ఆ తర్వాత పిసినారి పేదవాడి గా అవతారమెత్తి లక్ష్మీపతి ఇంటివద్దనే రెంట్ కి దిగుతాడు కృష్ణమూర్తి. ఆపై తన పిసినారితనం తో లక్ష్మీపతికి బాగా దగ్గరవుతాడు. ఈ దగ్గరయ్యే క్రమంలో చోటుచేసుకునే సన్నివేశాలు చాలా క్రియేటివ్ గా, హాస్య భరితంగా ఉంటాయి. నత్తి అరగుండు వెధవ పాత్రలో నటించిన బ్రహ్మానందం చెప్పే డైలాగులు కడుపుబ్బ నవ్వేలా చేస్తాయి. వాన పడటం లేదని పది రూపాయలు నీ జీతం నుండి కట్ చేస్తున్న అంటూ కోట శ్రీనివాసరావు బ్రహ్మానందం తో అనడం... తేరుకోలేని బ్రహ్మానందం... ఆ మొహం చూడు, పోతావురా అరేయ్ నాశనం అయిపోతావ్ అంటూ మనసులో కోట శ్రీనివాసరావు ని తిట్టడం చాలా హాస్య భరితంగా ఉంటుంది. అరగుండు పాత్రతో బ్రహ్మానందానికి ఎనలేని పేరు, ప్రఖ్యాతలు వచ్చాయి. 


ఇకపోతే ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాదు, దేవర, యామిజాల ప్రాంతాల లోని కొన్ని ఇళ్ళలో సెట్స్ లేకుండానే జంధ్యాల పూర్తిచేశాడు. ఎక్స్పెక్ట్ చేసా, నాకేంటి, మా తాతలు నలుగురు అంటూ చెప్పే డైలాగులు బాగా పాపులర్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: