2011 అక్టోబర్ 26 వ తేదీన తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి విడుదలయిన 7th సెన్స్ సినిమాలో సూర్య, శృతిహాసన్ హీరో హీరోయిన్ల గా నటించగా... జాన్నీ ట్రి ఎన్గ్యుయెన్ ప్రతినాయకుడి పాత్రలో జీవించేశాడు. ఈ సినిమాలో బోధిధర్మ సన్నివేశాలు చాలా బాగా ఆకట్టుకుంటాయి. ఆరవ శతాబ్దానికి చెందిన తమిళ పల్లవ రాజు బోధిధర్మ జీవిత చరిత్ర ఆధారంగా అతని గురించి ఈ సినిమాలో చూపించబడింది. ఈ తాత్వికుడైన బోధిధర్మ షావోలిన్ టెంపుల్ కట్టించి... కుంఫు, కలరి వంటి మార్షల్ ఆర్ట్స్ లలో సరికొత్త టెక్నిక్స్ కనిపెట్టి చైనా ప్రజలతో తన జ్ఞానాన్ని పంచుకున్నాడు. 


సెవెంత్ సెన్స్ సినిమాలో బోధిధర్మ పాత్రలో నటించిన సూర్య పూర్తి స్థాయిలో న్యాయం చేశాడని చెప్పుకోవచ్చు. మార్షల్ ఆర్టిస్ట్ గా, వైద్యుడిగా, కంటి చూపుతో వశీకరణ చేసే మాంత్రికుడిగా బోధిధర్మ ని ఏఆర్ మురుగదాస్ తన సెవెంత్ సెన్స్ లో సూపర్ గా చూపించాడు. ఈ చిత్రంలో మొదటి 21 నిమిషాలు బోధిధర్మ వీరత్వం, మంచితనం, చైనా ప్రజల కోసం తన ప్రాణాలను అర్పించడం వంటి సన్నివేశాలను చాలా అద్భుతంగా చిత్రీకరించి ప్రేక్షకులను వెండితెరకు కట్టి పడేసాడు మురగదాస్.


ముఖ్యంగా ఒక సన్నివేశం గురించి చెప్పుకుంటే... చైనాలోని ఒక ప్రాంతంలో భయంకరమైన వైరస్ చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా అందరి ప్రజలను ఘోరాతి ఘోరంగా చంపేస్తుంటుంది. ఐతే ఒక చిన్న పిల్లకు ఈ ప్రాణాంతకమైన వైరస్ సోకడంతో... ఆ ప్రాంత ప్రజలు ఆ బాలికను ఆకులతో చుట్టి అడవిలోని ఒక గుహలో పడేసి వస్తారు. ఐతే ఆ గుహలోనే బోధిధర్మ ధ్యానం చేస్తూ ఉంటాడు. ఈ బాలిక రాకను గ్రహించిన అతను వెంటనే ధ్యానం నుండి బయటకు వచ్చి ఆ బాలికకు సోకిన ప్రాణాంతకమైన వైరస్ ఏంటో తెలుసుకుంటాడు. తనకు తెలిసిన వైద్య విద్యతో విరుగుడు కనిపెట్టి ఆ బాలికకు చికిత్స చేసి నయం చేస్తాడు. తదనంతరం అదే బాలికను తీసుకొని వైరస్ ప్రబలుతున్న ప్రాంతానికి వెళ్లి ప్రజలకు కాస్త దూరంలో నిలబడతాడు. బోధిధర్మ ఆ ప్రదేశానికి కొత్తగా కనిపించడంతో ఆ బాలిక తల్లి అతడివైపు తదేకంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే బోధిధర్మ తన పొడవాటి వస్త్రం తొలగించే నయం చేసిన బాలికను చూపిస్తాడు.


ఈ సన్నివేశంలో హ్యారీస్ జయరాజ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది అని చెప్పుకోవచ్చు. ఈ సీన్ వచ్చినప్పుడు థియేటర్లోని ప్రేక్షకులంతా చప్పట్లు కొడుతూ ఈలలు వేస్తూ పెద్ద రచ్చ చేశారు అంటే అతిశయోక్తి కాదు. డోంగ్ లీ పాత్రలో నటించిన జాన్నీ ట్రి ఎన్గ్యుయెన్ చూడటానికి చాలా భయంకరంగా ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఇతను వియత్నం దేశానికి చెందిన ఫైట్ మాస్టర్, స్టంట్ కొరియోగ్రాఫర్, ఫిలిం యాక్టర్ కాగా ఈ సినిమాలో డోంగ్ లీ పాత్రలో నటించి ఆపరేషన్ రెడ్ పథకాన్ని ఇండియాలో సక్రమంగా అమలు చేసేందుకు, బోధిధర్మ శక్తులను మళ్ళీ ఏ మనిషి రూపంలో తెరపైకి రాకుండా చేసేందుకు ట్రై చేస్తుంటాడు. ఈ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఏదేమైనా మురుగదాస్ మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ సెకండాఫ్ లో కొన్ని బోరింగ్ సీన్స్ వల్ల సెవెంత్ సెన్స్ చిత్రం ప్రేక్షకాదరణ అంతగా పొందలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: