2004 ఏప్రిల్ 2వ తారీఖున కోడిరామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన పుట్టింటికి రా చెల్లి సినిమా లో అర్జున్ సర్జా, మీనా, మధుమిత ప్రధాన పాత్రలో నటించారు. అన్నాచెల్లెళ్ల అయిన శివన్న (అర్జున్), లక్ష్మి( మధుమిత) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోతారు. దాంతో శివన్న తన చెల్లి బాధ్యత అంతా తన భుజాలపై వేసుకొని ఆమెను పెంచి పెద్ద చేస్తాడు. అయితే లక్ష్మీ అజయ్ (శ్రీనాథ్) అనే ధనిక వ్యక్తిని ప్రేమించగా... తన అన్నయ్య వాళ్ళిద్దరికీ వివాహం చేస్తాడు. కానీ అజయ్ తల్లిదండ్రులకు లక్ష్మి పేద పిల్ల అని ఆమెపై చాలా కోపంగా పెంచుకుంటారు.


ఎప్పుడైతే లక్ష్మి భర్త అజయ్ విదేశాలకు వెళతాడో... ఆ క్షణం నుండి ఆమెను తమ ఇంటి నుండి బయటకు వెళ్లగొట్టేందుకు అత్తమామలు ప్రయత్నిస్తుంటారు. ఇందులోని భాగంగానే తమ కారు డ్రైవర్ తో లక్ష్మీ అక్రమ సంబంధం పెట్టుకుందని అజయ్ తో సహా అందరినీ నమ్మిస్తారు. ఇది తెలుసుకున్న శివన్న తన చెల్లిని తనతో పుట్టింటికి తీసుకెళ్తానని చెప్తాడు కానీ లక్ష్మీ మాత్రం అందుకు ససేమిరా అంటోంది. అనంతరం శివన్న తన చెల్లి నిజంగా తప్పు చేయలేదని ఎలా నిరూపిస్తాడో ఈ సినిమాలో చాలా చక్కగా చూపించబడింది. 


పుట్టింటికి రా చెల్లి సినిమా టైటిల్ లోనే కథ ఏంటో చెప్పేసాడు దర్శకుడు కోడి రామకృష్ణ. ఈ చిత్రంలో యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాల్లో నటించిన అర్జున్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అర్జున్ సరసన నటించిన మీనా కూడా చాలా అద్భుతంగా నటించిందని చెప్పుకోవచ్చు. షకీలా, సుధాకర్ ధర్మవరపు, సుబ్రహ్మణ్యం కామెడీ సన్నివేశాలు ప్రేక్షకుల్ని బాగా అలరించాయి. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిందని కొంతమంది చెబుతారు. ఈ చిత్రంలో లక్ష్మీ అత్తగారి ఇంటిలో మీనా చెప్పే డైలాగులు హైలెట్ గా నిలిచాయి. ఏదేమైనా అప్పట్లో మహిళా ప్రేక్షకులను బాగా ఏడిపించిన సినిమా గా పుట్టింటికి రా చెల్లి నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: