కరోనా ప్రభావం వినోద పరిశ్రమ మీద భారీ స్థాయిలో ఉంది. ఇప్పటికే భారీ చిత్రాల షూటింగ్‌లు, రిలీజ్ డేట్ల విషయంలో సందిగ్దత నెలకొంది. ఇప్పట్లో పరిస్థితులు చక్క బడే పరిస్థితి కనిపించకపోవటంతో స్టార్ హీరోల సినిమాలు కూడా ఓటీటీలోనే రిలీజ్ అవుతాయా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోలీవుడ్ టాప్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కిన మాస్టర్ సినిమాకు సంబందించి కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
ఖైదీ ఫేం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్టర్ సినిమా ఎప్పుడో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ అనుకునే సమయంలో కరోనా లాక్ డౌన్ రావటంతో రిలీజ్ వాయిదా పడింది. దీంతో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అర్ధం కావటం లేదు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోవటంతో నిర్మాతలు ఓటీటీ వైపు చూస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
మేకర్స్ పదే పదే ఆ విషయాన్ని ఖండించినా మళ్లీ మళ్లీ అదే న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ఈ వార్తలపై చిత్ర దర్శక నిర్మాతలు మరోసారి స్పందించారు. ఎంత ఆలస్యం అయినా మాస్టర్ థియేటర్లలోనే రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు చిత్రయూనిట్. సినిమా విషయంలో వస్తున్న పుకార్లను నమ్మ వద్దని, సినిమా దీపావళికి లేదా.. సంక్రాంతికి థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు.
గ్జావియర్ బ్రిట్టో నిర్మాతగా దాదాపు 250 కోట్లతో ఈ సినిమాను నిర్మించారు. విజయ్ సరసన మాళవికా మోనన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు. అర్జున్ దాస్, ఆండ్రియాలు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ రిలీజ్‌కు రెడీ అవుతోంది.