1964 జూలై 11న యనమండ్ర వెంకట సుబ్రమణ్య శర్మ అలియాస్ మణిశర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నం లో జన్మించారు. మణి శర్మ తండ్రి నాగ యజ్ఞ శర్మ కూడా సంగీత విద్వాంసులు. నాగ యజ్ఞ శర్మ 12 ఏళ్లకే పెళ్లి చేసుకున్నాడు. సంగీతం పై మక్కువతో అతను పశ్చిమ గోదావరి నుంచి మచిలీపట్నానికి తరలివచ్చారు. అక్కడ శాశ్వతంగా స్థిరపడిపోయిన తర్వాతనే నాగ యజ్ఞ శర్మ కి మణిశర్మ జన్మించారు. మచిలీపట్నంలో ఉపాధి దొరకని నాగ యజ్ఞ శర్మ పొట్టకూటికోసం మద్రాసు వెళ్లి సంగీత దర్శకుల వద్ద హార్మోనిస్టుగా జాయిన్ అయ్యారు. 1970 కాలంలో ఒక పాటకి హార్మోనిస్టుగా పని చేసినందుకు 10 నుంచి 30 రూపాయలు ఇచ్చేవారట. ఆ 10-30 రూపాయలతో నే మణిశర్మ తో సహా నలుగురు పిల్లలను, భార్యను పోషించేవారు.


తండ్రి సంగీత విద్వాంసులు అవ్వడంతో మణిశర్మ కి కూడా సంగీతం పట్ల ఆసక్తి పెరిగిపోయింది. మణి శర్మ స్కూల్ నుండి రాగానే వెంటనే హార్మోనియం వాయించేవారు. ఒక రోజు ఇది తెలుసుకున్న తండ్రి పాఠశాల నుండి వచ్చిన తర్వాత చదువుకోకుండా హార్మోనియం వాయిస్తావా?అని గట్టిగా గద్దయించి అతనికి హార్మోనియం అందకుండా ఇంట్లోని అటక పైన పెట్టారు. కానీ మణి శర్మ మాత్రం హార్మోనియం కావాలంటూ తీవ్రస్థాయిలో అల్లరి చేసేవాడు దీంతో తన అమ్మ హార్మోనియం తీసి ఇచ్చేవారు. ఇక అది తీసుకొని మణి శర్మ ఒక మూలన కూర్చుని ఇష్టం వచ్చినట్టు హార్మోనియం వాయించేవారు. ఐతే కొడుకు సంగీతం పట్ల ఆసక్తి చూపిస్తున్నాడని గ్రహించిన తండ్రి అతడికి వీలు చిక్కినప్పుడల్లా హార్మోనియం నేర్పించారు. కొద్దిరోజుల తర్వాత మణిశర్మ హార్మోనియం గురించి మొత్తం నేర్చుకొని సంగీత ప్రావీణ్యం పొంది అద్భుతంగా వాయించడం ప్రారంభించారు.


తదనంతరం తండ్రి సహాయంతో వయోలిన్ మాండలిన్ గిటార్ వంటి మ్యూజికల్ ఇంస్ట్రుమెంట్స్ కూడా వాయించడం ప్రారంభించారు మణిశర్మ. అయితే రికార్డింగ్ పాటలకి సంగీతం అందించే వాళ్లలో ఎక్కువగా కీబోర్డు నేర్చుకున్నవారికి ప్రాధాన్యత ఇచ్చేవారు. ఈ విషయం తెలుసుకున్న మణిశర్మ కీబోర్డు కూడా నేర్చుకున్నారు. తండ్రి నాగ యజ్ఞ శర్మ కి మధ్యాహ్నం ఆహారం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు స్టూడియోలో ఏం జరుగుతుందో నిశ్చింతగా పరిశీలించేవారు మణిశర్మ. ఆ సమయంలోనే మణిశర్మ ఇళయరాజా పాటలు విని అతనికి అభిమాని అయ్యారు. ఆ విధంగా సంగీతంపై మక్కువతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టి పాటలను స్వర పరచడం ప్రారంభించారు మణిశర్మ.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: