డబ్బింగ్ సినిమాలపై ఎప్పట్నుంచో పోరాడుతున్న కన్నడ సినీపరిశ్రమ ఈసారి అటోఇటో తేల్చుకునే పనిలో పడటంతో ఈవ్యవహారం క్లైమాక్స్ కి చేరింది. డబ్బింగ్‌ చిత్రాలను కన్నడంలో విడుదల చేస్తే థియేటర్లను తగులబెట్టే పరిస్ధితి రావచ్చునని కన్నడ నటుడు జగ్గేష్‌ చేసిన ట్వీట్‌ కన్నడ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. 

అంతేకాదు రాజమౌళి తీస్తున్న ‘బాహుబలి-2’ ను కన్నడంలోకి డబ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్న నేపధ్యంలో తాము ఈ ప్రయత్నాలను  అంగీకరించమని కన్నడ సినిమా పరిశ్రమ వర్గాలు అన్ని ఒక తాటి పై వస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ‘బాహుబలి’ లాంటి పెద్ద సినిమాను టార్గెట్ చేస్తే తమ పోరాటానికి దేశవ్యాప్తంగా పబ్లిసిటీ వస్తుందని ఈ కొత్త ఎత్తుగడ కన్నడ సినిమా పరిశ్రమ వేసినట్లు తెలుస్తోంది. 

ఈనేపధ్యంలో డబ్బింగ్‌ సినిమాల ఎంట్రీ పై చర్చించేందుకు ఈనెల 6న బెంగళూరులో కన్నడ సినిమా పరిశ్రమ కీలక సమావేశం నిర్వహించబోతోంది. కన్నడ సినిమారంగానికి చెందిన టీవీ నిర్మాతలు, సినీనిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇందులో పాల్గొన బోతున్నారు. 

ఇప్పటికే కష్టాల్లో ఉన్న కన్నడ సినీపరిశ్రమ ఈ డబ్బింగ్‌ జాడ్యంతో మరింత  నష్టపోతుంది అని వీరివాదన. దీనితో డబ్బింగ్‌ సినిమాలు విడుదల చేస్తే వాటిని ప్రదర్శించే థియేటర్లకు నిప్పు పెడతామంటూ వినిపిస్తున్న హెచ్చరికల మధ్య ‘బాహుబలి 2’ కన్నడ వెర్షన్ విడుదల ప్రశ్నార్ధకంగా మారింది అంటూ కన్నడ  మీడియా వార్తలు రాస్తోంది. 

కన్నడ సినీ పరిశ్రమను కాపాడుకోవడానికి డబ్బింగ్ సినిమాలను ఎప్పుడో నిషేధించింది. అయితే ఆవిషయాలను ఇప్పటివరకు కన్నడ సినిమా పరిశ్రమ సీరియస్ గా అమలు పరచలేదు. ఈ పరిస్థితుల నేపధ్యంలో ‘బాహుబలి-2’ సినిమాను కన్నడంలోకి డబ్బింగ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలు రావడంతో ఈ వ్యవహారం మరింత రాజుకుంది.  ఈ నెల 6వ తేదీన కన్నడ సంఘాలు, సినిమా వర్గాలతో  జరగబోతున్న ప్రత్యేక సమావేశoలో ఏదైనా ఒక కఠిన నిర్ణయం ‘బాహుబలి 2’ మార్కెట్ కు ఒక అనుకోని షాక్ గా మారే అవకాశం  ఉందని కన్నడ  మీడియా వార్తలు రాస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: