గత కొంత కాలంగా సూపర్ స్టార్ మహేష్ బాబు కి బ్యాడ్ టైమ్ నడుస్తున్న విషయం తెలిసిందే.  కొరటాల దర్శకత్వంలో శ్రీమంతుడు తర్వాత వచ్చిన బ్రహ్మోత్సవం, స్పైడర్ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో తన తదుపరి చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టాలన్న ఉద్దేశ్యంతో మరోసారి కొరటాల దర్శకత్వంలో నటిస్తున్నారు మహేష్ బాబు. 

మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం భరత్ అనే నేను. ఏప్రిల్ 20న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ పై చిత్ర యూనిట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. టైటిల్ తోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా పోస్టర్స్ తో మరింత ఆసక్తిని కలిగిస్తుంది. రిపబ్లిక్ డే సందర్భంగా ఫస్ట్ ఓథ్ పేరుతో ఓ ఆడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఇందులో.. ‘భరత్ అనే నేను’ శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. నిజమైన విశ్వాసం.. విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతః కరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగానీ, పక్షపాతం గానీ, రాగ ద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అంటూ మహేష్ వాయిస్ ఓవర్తో సినిమాపై దుమ్మురేపారు. 

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు.  ప్రస్తుత విద్యా విధానం.. దానిని ఓ యువ ముఖ్యమంత్రి ఏ విధంగా మార్చాడు అనే దానిపై సినిమా అద్భుతంగా తెరకెక్కించినట్లు కనిపిస్తుంది.  ‘చిన్నప్పుడు మా అమ్మ నాకో మాట చెప్పింది...ఒకసారి ప్రామిస్ చేసి ఆ మాట తప్పితే..యు ఆర్ నాట్ కాల్డ్ ఏ మాన్ అని...ఎప్పటికీ ఆ మాట తప్పలేదు..మర్చిపోలేదు..నా జీవితంలోనే అతి పెద్ద ప్రామిస్ చేయాల్సిన రోజు ఒకటొచ్చింది..పెద్దదీ కాదు..కష్టమైంది కూడా..భరత్ అనే నేను’ అంటూ టీజర్ అంచనాలు పెంచేశారు.

ఈ మూవీకి దేవి శ్రీ సంగీతం అందిస్తున్నాడు. కైరా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం తప్పక భారీ విజయం సాధిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: