‘గూఢచారి’ సక్సస్ మీట్ లో నాగార్జున ఈ సంవత్సరం ఎన్నో సినిమాలు విడుదల అయినా రియల్ హిట్స్ మాత్రం ‘రంగస్థలం’ ‘మహానటి’ ‘గూఢచారి’ సినిమాలు మాత్రమే అంటూ చేసిన కామెంట్స్ మహేష్ అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈసంవత్సరం సమ్మర్ రేస్ కు విడుదలై మహేష్ కెరియర్ లోనే అత్యధిక కలక్షన్స్ రాబట్టి భారత పార్లమెంట్ సమావేశాలలో ప్రస్తావనకు కూడ వచ్చిన ‘భరత్ అనే నేను’ నాగార్జున దృష్టిలో పడలేదా అంటూ మహేష్ అభిమానులు విమర్శిస్తున్నారు.

ఈ ఏడాది మంచి హిట్ టాక్ తెచ్చుకున్న ‘భాగమతి’ ‘ఛలో’ సినిమాలతో పాటు కేవలం రెండున్నర కోట్ల రూపాయలతో నిర్మింపబడి 15 కోట్ల కలక్షన్స్ తెచ్చుకున్న ‘ఆర్ ఎక్స్ 100’ సాధించిన సంచలన విజయం నాగార్జున మర్చిపోయాడా అంటూ మహేష్ అభిమానులు నాగార్జున పై సెటైర్లు వేస్తున్నారు. అంతేకాదు కేవలం ‘గూఢచారి’ సినిమాను పొగడటం కోసం ఈ ఏడాది రియల్ హిట్స్ గా మారిన చాల సినిమాలను నాగార్జున మర్చిపోవడం ఎంత వరకు సమంజసం అని అంటూ మహేష్ అభిమానులు అసహనాన్ని వ్యక్త పరుస్తున్నారు.

ఇదే సందర్భంలో మహేష్ అభిమానులు మరో ట్విస్ట్ ఇస్తూ నాగార్జున తన మేనకోడలు సుప్రియను పొగడటం కోసం మిగతా సినిమాలను తగ్గించి మాట్లాడటం ఒక టాప్ హీరో స్థాయికి తగిన కామెంట్స్ కావు అంటూ అభిప్రాయ పడుతున్నాడు. వాస్తవానికి నాగార్జున మహేష్ ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్నా నాగ్ మహేష్ రికార్డులను ఎలా మర్చిపోయాడు అంటూ ప్రిన్స్ అభిమానులు ఎదురు ప్రశ్నిస్తున్నారు.

దీనితో యధాలాపంగా నాగార్జున అన్న కామెంట్స్ పెను ప్రకంపనలే సృష్టిస్తున్నాయి. ఒక సినిమా విజయానికి ఆసినిమా కథ దర్శకత్వ ప్రతిభతో పాటు ఆసినిమా రిలీజ్ అయ్యే టైమింగ్ కూడ చాల కీలకంగా ఉంటుంది. ఈమధ్య కాలంలో పెళ్లి సినిమాలు ప్రేమ సినిమాలు ఎక్కువైపోతున్న పరిస్థుతులలో చాల కాలం తరువాత వచ్చిన ఒక ‘స్పై’ జోనర్ మూవీ ‘గూఢచారి’ కావడంతో చేంజ్ లో పడ్డ ‘గూఢచారి’ అనుకోని విజయం సాధించింది అని భావించడంలో ఎటువంటి సందేహం లేదు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: