మన భారతీయ సంస్కృతిలో అమావాస్య రోజు వచ్చే ఒకే ఒక్క పండుగ దీపావళి. ఆరోజు మన దేశంలోని ప్రతి ఇల్లు దీప మాలికగా వెలిగిపోతుంది. ఆనంద ఉత్సాహాలతో జాతి కుల మత వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగ దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి గా జరుపుకునే ఈపండుగ నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు జరుపుకునే పండుగ అన్నకథ యుగ యుగాలుగా ప్రచారంలో ఉంది. 
deepavali lighting
దీపమాలికలతో లక్ష్మీదేవికి నీరాజనమిచ్చే రోజు కావడంచేత దీనికి దీపావళి అని పేరొచ్చింది. ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకుంటాం. లక్ష్మీ పూజ లేదా దీనినే ఐశ్వర్యాన్ని సంపదలను కలిగించే అమ్మవారిగా ఆరోజు జరిపే పూజకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. మన దేశంలోని ఉత్తర భారత దేశమైనా లేక దక్షిణ భారతదేశమైనప్పటికి దీపావళి పండుగ కార్యక్రమాలలో లక్ష్మీపూజ ప్రధానమైంది. 
Deepavali
లక్ష్మీ దేవి చల్లని చూపు తమపై ప్రసరించాలని కోరుతూ ప్రతి ఇంట్లోను పండుగనాడు స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు అందరూ అట్టహాసంగా లక్ష్మీ పూజలు చేస్తారు. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో చక్కటి శుభ్రత ఒకటి కాబట్టి శుభ్రంగా కళకళ లాడే ఇంటిలోనే ఆ మాత మొట్టమొదటే అడుగు పెడుతుందనే నమ్మకంతో ప్రతి ఇల్లు ఆరోజు ఎంతో శుభ్రతతో వివిధ రకాల ముగ్గులతో దీపాలతో పూలతో అలంకరిస్తారు. శుభ్రతకు చిహ్నమైన చీపురు కట్టకు పసుపు కుంకుమలు పెట్టి ఈరోజున పూజిస్తారు. అమ్మవారు తాము పెట్టిన దీపాల వెంట రావాలని కోరుతూ సాయంత్రమయ్యే సరికి ప్రమిదల దీపాలు లేదంటే, రంగురంగుల బల్బులు కల తోరణాలను ఇంటికి కట్టి అలంకరణలు చేస్తారు. 
Our Most Colourful Festival, Deepavali is Here!
ఇక దీపావళి రోజున ప్రధానంగా వినాయకుడిని లక్ష్మీ దేవిని కలిపి పూజిస్తారు. లక్ష్మీ దేవిని ఆమె మూడు రూపాలయిన లక్ష్మీ సరస్వతి మహా కాళి రూపాలలో పూజిస్తారు. వీరితో పాటు సంపదకు అధిపతి అయిన కుబేరుడిని కూడా పూజిస్తారు. లక్ష్మీదేవి రూపం గణపతితో పాటు ఉంటుంది. తాము నిర్వహించే కార్యాలకు ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడాలని సిరులిచ్చే తల్లి కరుణాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ దీపావళి వేళ లక్ష్మీగణపతుల పూజ చేయడం కొన్నివేల సంవత్సరాల నుండి కొనసాగుతున్న సాంప్రదాయం. ప్రస్తుతం మనిషి జీవితం యాంత్రికమైన నేపధ్యంలో దీపావళి హడావిడి కేవలం రెండు రోజులకే పరిమితం అవుతోంది.   పూర్వకాలంలో దీపావళి హడావిడి నెలరోజులు ముందు నుండే కనిపించేది. ఒక దీపం వెలిగించి దానిని లక్ష్మీ స్వరూపంగా భావించి ఏకాగ్రతతో కొన్ని క్షణాల పాటు ధ్యానం చేయగలిగితే మనిషి జీవితంలో పోగొట్టుకున్నవన్నీ తెరిగి సంపాధించుకోవచ్చని మన పెద్దలు అంటారు. మన ఆచారాలకు ఆధ్యాత్మికతను జోడించి జరుపుకునే పండుగ దీపావళి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: