పవన్ కళ్యాణ్ రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొనసాగిస్తున్న ప్రజా పోరాట యాత్రలో ఈరోజు ఎవరూ ఊహించని ఒక ట్విస్ట్ ఇస్తున్నాడు. పవన్ కల్యాణ్ నేడు చేపడుతున్న రైలు యాత్ర పవన్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. సమకాలీన రాజకీయాల్లో వినూత్నంగా చేపట్టిన ఈకార్యక్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్ విజయవాడ నుంచి తుని వరకు జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో జనంతో కలిసి రైల్లో ప్రయాణిస్తూ ఒక సరికొత్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాడు. 

జనసేన పార్టీ వర్గాలు ఈవిషయానికి సంబంధించిన అధికారిక సమాచారం తెలియచేయడమే కాకుండా ఈ జర్నీకి సంబంధించిన పోస్టర్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేసారు. ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం 1.20 నిమిషాలకు విజయవాడ లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌‌లో ఎక్కడం ద్వారా పవన్ ఈయాత్రకు శ్రీకారం చుడతాడు. 

ఈరోజు సాయంత్రం 5.20 నిమిషాలకు తుని రైల్వే స్టేషన్‌లో దిగడంతో ఈ రైలు యాత్ర కార్యక్రమం పూర్తి అవుతుంది. ఈ ప్రయాణంలో రైలులో తనతో ప్రయాణం చేస్తున్న జనం నుండి ప్రజా సమస్యలు తెలుసుకోవడమే కాకుండా జనసేన పార్టీ ఆశయాలను అందరికీ వివరించే అస్త్రంగా ఈ రైలు యాత్రను పవన్ మార్చుకోబోతున్నట్లు సమాచారం. 

 ఈరైలు యాత్రకు సంబంధించి ‘జనసేన’ తన కార్యకర్తలకు కొన్ని విధివిధానాలు సూచిస్తూ ఒక ప్రకటన కూడ చేసింది. విజయవాడ నుంచి తుని వరకూ వివిధ స్టేషన్‌లో పవన్‌ కు శుభాకంక్షలు తెలిపేందుకు వచ్చే అభిమానులు అంతా విధిగా ప్లాట్‌ఫామ్ టికెట్ ను తీసుకునిరైల్వే అధికారులకు సహకరించాలని ఆరైల్వే టిక్కెట్లను బ్యాడ్జిలుగా ధరించిస్టేషన్ లోకి రావాలని పవన్ ఇచ్చిన పిలుపు కొత్త రాజకీయాలకు శ్రీకారం చుడుతోంది. అంతేకాదు పవన్ ప్రయాణించే జనమ్మభూమి ఎక్స్ ప్రెస్ ద్వారా ప్రయాణించే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నడుచుకోవాలని పవన్ ఇచ్చిన సూచనలు ఎంతవరకు పవన్ అభిమానులు అనుసరిస్తారో చూడాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: