భారతీయ పండుగలు అన్నింటిలో ఒక సాంప్రదాయంతో పాటు మన ఆచార వ్యహారాలు అంతర్లీనంగా కనిపిస్తాయి. అయితే దీపావళి పండుగలో మాత్రం మన ఆచారవ్యహారలతో పాటు జ్యోతిష్యశాస్త్రం ప్రాముఖ్యత కూడ అంతర్లీనంగా కనిపిస్తుంది. దీపావళి ఉత్తరాది ప్రాంతంలో కొత్త చాంద్రమాన సంవత్సరాన్ని సూచిస్తోంది. అందుకే ఉత్తరాది ప్రాంతంలోని కొన్నిరాష్ట్రాలకు సంబంధించిన వారు ముఖ్యంగా గుజరాతీలు రాజస్థానీలు ఈపండుగ రోజు నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం అయినట్లుగా భావిస్తారు.  ఈరోజున గ్రహాల స్థానాలు జ్యోతిష్య శాస్త్ర రీత్యా చాలా అనుకూలంగా ఉంటాయి కాబ్బట్టి ఈరోజు అందరికీ సంపదను అదృష్టాన్ని ఆరోగ్య సిరిసంపదలను ఆహ్వానించడానికి అనుకూలమైనరోజుగా భావిస్తారు. 
Diwali
దీపావళి రోజున సూర్యుడు మరియు చంద్రుల కలయిక ఉంటుంది. ఈ రోజు స్వాతీ నక్షత్రంలో తులారాశి ప్రవేశించడంతో  ఈరోజు దీపావళి పండుగ జరుపుకునే ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రేమ, సరిసంపదలు, సంతోషం, మంచి ఆరోగ్యం, మరియు ఆనందాలు కలిగించే గ్రహస్థితులు ఉన్నాయని జ్యోతిష్య పండితులు చెపుతూ ఉంటారు. దీపావళిని  ఐదు రోజుల పండుగగా ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, బలి పాడ్యమి యమ ద్వితీయ (బాయ్ దూజ్)గ జరుపుకునే సాంప్రదాయం ఉంది.  దివాళీ అనేది సంస్కృత పదం. దీపం దేవతకు ప్రతి రూపం అని మన నమ్మకం. 

దీపం అంటే ప్రాణశక్తికి ప్రతీక ఆనందానికి మరొక రూపం కనిపించే దైవం చీకటిని పారద్రోలి వెలుగు ఇచ్చే సాధనం ఒక్క మాటలోచెప్పాలి అంటే  పరబ్రహ్మ స్వరూపం. వెలిగించిన దీపం నిశ్చలంగా ప్రకాశిస్తుంటే అది మనకు మన మనస్సుకు ప్రశాంతతను కలిగించడమే కాకుండా ఏకాగ్రతను కుదురుస్తుంది. మన పురాణాల ప్రకారం  అసత్యం పై సత్యం సాధించిన విజయంగా దీపావళిని గుర్తిస్తాం. మనం పెంచుకున్న పుణ్యం కాంతి అనుకుంటే చేసిన పాపాలను చీకటి అనుకోవాలి. అప్పుడు దీపకాంతి ఆచీకట్లనే పాపాలను తొలగిస్తుంది.  కాబాట్టి ఈరోజు ఎన్నిదీపాలు పెడితే అంతమంచిది అని అంటారు. 

జోతిషశాస్త్ర ప్రకారం అశ్వయుజ అమావాస్య రోజున సూర్యుడు తులారాశిలో చంద్రుని యొక్క సంయోగం వల్ల ఈరోజు ఏదైనా మొదలు పెడితే మంచిది అన్న నమ్మకం మనదేశంలోని ఉత్తరాది ప్రాంతంలోని వారికి చాలా ఎక్కువ.   ఆయురారోగ్యాలు సరిసంపదలు శ్రేయస్సుని ఆహ్వానించడానికి దీపావళి రోజున సూర్యుడుని హానుమంతుడిని గణేష్ ని లక్ష్మీదేవిని పూజిస్తారు. మానవజీవితమంతా చీకటి వెలుగుల సంగ్రామం కాబట్టి ఆపోరాటానికి మనిషిని సన్నద్దం చేసే శక్తి దీపంలో ఉంది అంటారు. ప్రతి మనషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో చీకటిగా మారిన నిరాశతో పోరాటం చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ఆనిరాశ అనే కారుచీకటిని పారద్రోలి ప్రతి మనిషి ఒక మనీషిగా ఎదగాలి అన్న స్పూర్తిని ప్రతి వ్యక్తికి ఈదీపావళి అందిస్తుంది. వెలుగుల పండుగగా ఈరోజు జరుపుకుంటున్న ఈదీపావళి అందరి జీవితాలలో వెలుగులు పంచె కాంతుల హారావళిగా మారాలని ఆకాంక్షిస్తూ అందరికీ  ఇండియన్ హెరాల్డ్ దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: