ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ కొడుకుగా పుట్టిన గోపీచంద్ కు అసలు సినిమాలంటే ఇష్టంలేదు. తనతండ్రి తన 8 సంవత్సరాల వయసులో చనిపోవడంతో పాటు గోపీచంద్ అన్న కూడ చిన్న వయస్సులోనే చనిపోవడంతో వేరేమార్గం లేక సినిమాలలోకి వచ్చాను అని అంటున్నాడు గోపీచంద్. తాను చిన్నతనంలో ఎదుర్కున్న బాధలు చెప్పడానికి తనమాటలు సరిపోవు అంటూ ప్రభాస్ తో తన స్నేహం రష్యాలో తన చదువు శ్రీకాంత్ తో తన బంధుత్వం గురించి అనేక ఆసక్తికర విషయాలు ఈరోజు ఒకప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోపీచంద్ షేర్ చేసుకున్నాడు. 

చిత్రపరిశ్రమలో తనకు సన్నిహిత మిత్రుడు అంటే ఒక ప్రభాస్ పేరు మాత్రమే చెపుతానని అయితే తామిద్దరం తరుచూ కలవకపోయినా ఇంచుమించు ప్రతిరోజు ఫోన్ లోనే మాట్లాడుకుంటాము అన్నవిషయం చాలామందికి తెలియదు అంటూ తమఇద్దరి మధ్యా ఉన్న స్నేహాన్ని బయటపెట్టాడు గోపీచంద్. అయితే అవకాసం కుదిరినప్పుడు తామిద్దరం కలిసి రాత్రి ప్రోద్దుపోయే వరకు గంటలుగంటలు మాట్లాడుకుంటూనే ఉంటామని తనకు ప్రభాస్ తో ఉన్న సాన్నిహిత్యాన్ని తెలియచేసాడు. 

వాస్తవానికి తాను మొదటిసారి ప్రభాస్ ను చూసింది కృష్ణంరాజు ఆఫీసులో అని గుర్తుకు చేసుకుంటూ తాను మొదటిసారి ప్రభాస్ ను చూసినప్పుడు ‘నువ్వు పెద్ద హీరో అవుతావు’ అని తాను కామెంట్ చేస్తే ప్రభాస్ నవ్వుతూ ఎందుకు తనపై జోక్ చేస్తున్నావు అంటూ రివర్స్ జోక్ వేసిన సందర్భాన్ని గుర్తుకు చేసుకున్నాడు గోపీచంద్. అయితే తమఇద్దరి సాన్నిహిత్యం తెలిసినవారు చాలామంది ప్రభాస్ తో తాను కలిసి ఒక మల్టీ స్టారర్ ఎందుకు చేయకూడదు అంటూ అని ప్రశ్నిస్తూ ఉంటారని ఆఉద్దేశ్యం తమ ఇద్దరికీ ఉన్నా కలిసి సినిమా చేయదగ్గ కథ గురించి ఎదురు చూస్తున్నాను అంటూ గోపీ చంద్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. 

ప్రభాస్ తాను హీరోలు అవ్వకముందు ఒకే మోటర్ సైకిల్ పై కలిసి హైదరాబాద్ లోని వివిధ హోటల్స్ కు వెళ్ళిన సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ అక్కడ రకరకాల పదార్ధాలు తిన్నా తామిద్దరం తమఇంటికి వచ్చి తనతల్లి చేసి ఉంచిన మామిడికాయ పచ్చడి నేతితో తిన్నంత రుచి తామిద్దరం ఎక్కడా పొందలేదు అంటూ అలనాటి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకున్నాడు. తాను ఇప్పటి వరకు చాల సినిమాలలో నటించినా తన కొడుకు విరాట్ కృష్ణ ఫలానా సినిమా ఎందుకు చేసావు అంటూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతున్నాను అంటూ తన కొడుకు పై జోక్ చేస్తూ తన కొడుకులో తన తండ్రిని చూసుకుంటున్నాను అని అంటున్నాడు గోపీచంద్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: