2018 తెలుగు సినిమా చరిత్రను తిరగేస్తే.. పలువురు కొత్త భామలు ఈ ఏడాది తెలుగు తెరకు పరిచయం అయ్యారు. తమ అందచందాలతో వెండితెరపై సత్తా చాటారు. లేత అందాలతో ఆకట్టుకున్నవారు కొందరైతే.. అభినయంతో అలరించిన వారు మరికొందరు. మరి వారి వివరాలు చూద్దామా..
ఈ కొత్త హీరోయిన్ల జాబితాలో కన్నడ భామ రష్మిక మండన్న ముందు వరుసలో ఉంటుంది. ఈ అమ్మడు చలో చిత్రంతో అరంగేట్రం చేసి.. గీత గోవిందం చిత్రంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. నటన, అభినయం కలగలిపిన ఈ సుందరి రాకతో తెలుగు తెరకు కొత్త జోష్ వచ్చింది.
భరత్ అనే నేను చిత్రం ద్వారా పరిచయమైన కియారా అద్వానీ కూడా ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడీ భామ వినయ విధేయరామలోనూ రామ్ చరణ్ పక్కన నటిస్తోంది.
ఆ తర్వాత చెప్పుకోవలసిన వారిలో పంజాబీ భామ పాయల్ రాజ్పుత్ ఉంది. ఆర్ఎక్స్ 100 చిత్రంలో అధర చుంభనాలకు వెనుకాడకుండా ఓకే చెప్పేసిన ఈ అమ్మడు.. హాట్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కేవలం బోల్డ్ సీన్స్ లోనే కాకుండా నటనలోనూ పేరు తెచ్చుకుంది.
మిగిలిన వారిలో టాక్సీ వాలా చిత్రంతో ప్రియా జావల్కర్ సక్సస్ చవి చూసింది. ఇక గూఢచారి చిత్రంతో శోభిత ధూళిపాల కూడా ఆకట్టుకుంది.
సవ్యసాచి చిత్రం ద్వారా పరిచయమైన నిధి అగర్వాల్ లేత అందాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ సినిమా అంతగా సక్సస్ కాకపోయినా నిధికి వరుస అవకాశాలు లభిస్తున్నాయి.