వచ్చేవారం రాబోతున్న తెలుగువారి పెద్దపండుగ సంక్రాంతి సినిమాల రేస్ కనీవిని ఎరుగని స్థాయిలో జరుగుతున్న నేపధ్యంలో ఈ ఏడాది సంక్రాంతి రేస్ విజేత ఎవరు అన్న కోణంలో అప్పుడే అంచనాలు మొదలు అయిపోయాయి. ఈసారి సంక్రాంతి రేస్ కు వస్తున్న సినిమాలు అన్నీ భారీ బడ్జెట్ సినిమాలు కావడంతో తెలుగు ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమాలు అన్నీ చూడాలి అంటే    సుమారు 400 కోట్ల రూపాయిలు ఖర్చుచేయాలి అంటూ ఇండస్ట్రీ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. 

ఈసంక్రాంతి సీజన్ ను టార్గెట్ చేస్తూ నాలుగు భారీ సినిమాలు వస్తున్న నేపధ్యంలో ఈనాలుగు సినిమాలపై సుమారు 400 కోట్ల బిజినెస్ జరిగింది.  సంక్రాంతి సీజన్ ను దృష్టిలో పెట్టుకుని అత్యంత భారీ రేట్లకు ఈనాలుగు సినిమాలను కొనుక్కున్న బయ్యర్లు ఈ సినిమాలకు సంబంధించి నష్టపోకుండా బయటకు రావాలి అంటే ఖచ్చితంగా ఈనాలుగు సినిమాలకు రాబోతున్న సంక్రాంతి సీజన్ లో 400 కోట్ల గ్రాస్ కలక్షన్స్ రావాలి అని అంటున్నారు. 

చరణ్ ‘వినయ విధేయ రామ’ కు 100 కోట్ల బిజినెస్ జరిగితే అదే స్థాయిలో ఎన్టీఆర్ బయోపిక్ కు కూడ 100 కోట్ల స్థాయిలో బిజినెస్ జరిగింది. దీనికితోడు వెంకటేష్ వరుణ్ తేజ్ ల ‘ఎఫ్ 2’ రజినీకాంత్ ‘పెట్టా’ సినిమాలకు సంబంధించి 100 కోట్ల వరకు బిజినెస్ జరగడంతో ఈ సంక్రాంతి సినిమాల బయ్యర్లు అందరు నష్టాలు లేకుండా బయటపడాలి అంటే ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల నుంచి 400 కోట్లకు పైగా  కలెక్షన్స్  రావాలి. దీనితో  సగటున టిక్కెట్ రేటు 100 రూపాయలు వేసుకున్నా ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్ల మంది ఈసంక్రాంతి సినిమాలు చూడాలి అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి. 

అయితే ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజలు పండుగలు అంటే బుల్లితెర ప్రత్యేక కార్యక్రమాలకు అతుక్కుపోతున్న నేపధ్యంలో ఈ బుల్లితెర మ్యానియా నుండి తప్పించుకుని ప్రేక్షకులు సంక్రాంతి సినిమాల థియేటర్స్ కు ఎంతవరకు వస్తారు అన్నది ప్రస్తుతానికి  సమాధానంలేని ప్రశ్న. దీనితో ఈసంక్రాంతి పందెంలో విజేత ఎవరు అన్న విషయమై ఆతృత విపరీతంగా పెరిగిపోతోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: