ఈ సంవత్సరం రిపబ్లిక్ డే కు సంబంధించి నలుగురు తెలుగువారికి పద్మశ్రీలు వరించాయి. ‘సిరివెన్నెల’ సినిమాతో తన ఇంటి పేరునే సిరివెన్నెలగా మార్చుకున్న సిరివెన్నెల సీతారామ శాస్త్రికి పద్మశ్రీ రావడం తెలుగు పాటకు వచ్చిన అరుదైన సత్కారంగా ఫిలిం ఇండస్ట్రీ భావిస్తోంది. 

మల్లాది పింగళి శ్రీశ్రీ సముద్రాల ఆత్రేయ ఆరుద్ర దాశరధి నారాయణరెడ్డి వేటూరిల వరకు ఎందరో కవులు పాటల రచయితలుగా సినిమా రంగాన్ని రాజ్యమేలారు అయితే సిరివెన్నెల అదృష్టం వేరు. సినిమా పాటల రచయితగా ఆయన ప్రాచూర్యం పొంది సాహితీ ప్రపంచంలో చెప్పుకోతగ్గ పుస్తకాలు రాయకపోయినా ఆయన సినిమా పాటలే ఆయన ప్రతిభకు నిలువెత్తు నిదర్శనంగా మారి సిరివెన్నెల సాహితీ ప్రతిభకు పద్మశ్రీ సత్కారాన్ని తెచ్చిపెట్టాయి. 

‘తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం’ అన్నట్లుగా ప్రముఖ దర్శకుడు విశ్వనాథ్ దృష్టిలో పడిన తరువాత సీతారామశాస్త్రి తన పాటలతో పదాల మాయ చేసి సిరివెన్నెల సీతారామశాస్త్రిగా తెలుగు ప్రజల హృదయాలలో ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఉత్తరాంద్ర ప్రాంతానికి చెందిన సిరివెన్నెలకు తెలంగాణ కోటాలో పద్మశ్రీ రావడంతో తెలుగు వారు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ప్రజలు అంతా ఒక్కటే అన్న సందేశాన్ని ఇస్తోంది. 

తెలుగు సినిమా రంగానికి సంబంధించి యుగళగీతాల దగ్గర నుండి విప్లవ గీతాల వరకు వేల సంఖ్యలో పాటలు వ్రాసారు. ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని’ అంటూ పాట వ్రాసినా ‘బలపం పట్టి భామ ఒళ్లో అ..ఆ..ఇ..ఈ నేర్చుకున్నా’ అంటూ మరొక విధంగా వ్రాసినా అది ఆయన సమర్ధతకే నిదర్శనం. ప్రకృతి సౌందర్యాన్ని తన పాటలలో ప్రతిబింబింప చేసే సిరివెన్నెల ఏకంగా శివుడి ని బూడిద పూసుకున్న దేవుడుగా అభివర్ణిస్తూ శివుడు తనకు ఏమి వరాలు ఇవ్వగలడు అంటూ ప్రశ్నించాడు. సిరివెన్నెల సినిమా పాటలలోని అర్ధాలను వెతికే పని చేపడితే అది ఒక పరిశోధన అవుతుంది. అలాంటి మహోన్నత వ్యక్తికి ఈరోజు పద్మశ్రీ లభించడం తెలుగు సినిమా పాటలు వ్రాసే కవులు అందరికీ గర్వకారణం.. 



మరింత సమాచారం తెలుసుకోండి: