పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమై రాజకీయాల బాట పట్టినా జనం ఇప్పటికీ పవన్ ను రాజకీయ నాయకుడుగా కంటే హీరోగానే గుర్తిస్తున్నారు. ఈవిషయాలు పవన్ దృష్టి వరకు వచ్చినట్లు ఉన్నాయి. అందుకనే నిన్న కర్నూల్ లోని కొండా రెడ్డి బురుజు వద్ద ఏర్పాటు చేసిన ఒక రోడ్ షోలో పవన్ అత్యంత ఆవేశపూరితంగా మాట్లాడుతూ తన మాటల మధ్య ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ ‘కాటమరాయుడు’ ల ప్రస్తావన తీసుకు రావడంతో అభిమానులు జోష్ లోకి వెళ్ళిపోయి కేరింతలు కొట్టారు. 

ఇదేసందర్భంలో పవన్ మాట్లాడుతూ తాను ఒక కులాన్ని నమ్ముకుని రాజకీయాలలోకి రాలేదు అని చెపుతూ ఒక కులం ఆదరిస్తే తాను పవర్ స్టార్ కాలేదనీ రోజురోజుకు పెరిగిపోతున్న కుల వ్యవస్థను అంతం చేయడానికి తాను రాజకీయాలలోకి సినిమాలు మానుకుని వచ్చిన విషయాన్ని వివరించాడు. తాను ఎదో జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల ఇన్ని లక్షలమంది అభిమానులు ఏర్పడ్డారు అంటూ కర్నూలు గొప్పతనాన్ని వివరిస్తూ తరుచూ ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ ప్రస్తావన తీసుకురావడంతో అన్న సినిమాకు తమ్ముడు ఈవిధంగా పబ్లిసిటీ చేస్తున్నాడా అంటూ ఆ రోడ్ షోకు వచ్చిన కొందరు మీడియా వర్గాలు కామెంట్స్ చేసుకున్నట్లు టాక్. 

ఇదేసందర్భంలో తన ‘జనసేన’ పై వస్తున్న సర్వేల గురించి మాట్లాడుతూ ఓటమికి భయపడే వాడికి గెలుపు రాదనీ ఎవరో ఒకరు మార్పు కోసం ప్రయత్నించాలని పిలుపు ఇస్తూ తాను 25 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉండబోతున్న స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు. అయితే ఈమాటలను బట్టి చూస్తుంటే ఇక పవన్ శాస్వితంగా సినిమాలకు దూరం అయినట్లేనా అని అనిపిస్తోంది. 

తన ‘జనసేన’ కు మీడియా సపోర్ట్ లేదు అని వస్తున్న వార్తల పై స్పందిస్తూ తన జనసైనికులే తన పేపర్లు ఛానల్స్ అంటూ తన కార్యకర్తలకు నూతన ఉత్సాహం నింపే ప్రయత్నం చేసాడు. పవన్ తన ఉపన్యాసంలో రాబోతున్న ఎన్నికలలో కొన్ని సీట్లు మాత్రమే వచ్చినా ‘జనసేన’ క్రియాశీలక శక్తిగా మారుతుందనీ ఆత్మవిశ్వాసంతో చేస్తున్న కామెంట్స్ దేనికి సంకేతం అన్న సందేహాలతో పాటు పవన్ పదేపదే తనకుతాను పవర్ స్టార్ ని అని గుర్తుకు చేస్తూ ఇస్తున్న సంకేతాలను బట్టి పవన్ రానున్న ఎన్నికల తరువాత అవసరం అనుకుంటే తిరిగి యూటర్న్ తీసుకుని సినిమాలలో నటిస్తాను అని ఇస్తున్న సంకేతాలు అంతర్లీనంలో దాగి ఉన్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: